జూబ్లీహిల్స్ గెలిచి మోదీకి గిఫ్ట్ ఇద్దాం..బీజేపీ గ్రేటర్ నేతలంతా ప్రచారంలో పాల్గొనాలి: రాంచందర్ రావు

జూబ్లీహిల్స్ గెలిచి మోదీకి గిఫ్ట్ ఇద్దాం..బీజేపీ గ్రేటర్ నేతలంతా ప్రచారంలో పాల్గొనాలి: రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు:  జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచి, ఆ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ గా ఇద్దామని బీజేపీ నేతలు, కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్​లోని ప్రతి నాయకుడు, కార్యకర్త ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 8 జిల్లాల ప్రధాన నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

 జూబ్లీహిల్స్ ఎన్నికల వ్యూహం, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గత బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ విషాద నగరంగా మారిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అభివృద్ధిని కనుమరుగు చేసిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని.. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మజ్లిస్‌‌‌‌‌‌‌‌తో కలుస్తున్నాయని రాంచందర్ రావు ఆరోపించారు. 

ఇటీవల నగరంలో ముస్లిం ఖబ్రస్తాన్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు రక్షణ శాఖ భూములను కట్టబెట్టే ప్రయత్నం చేశారని, మరోవైపు హిందూ దేవాలయాలను కూలగొడుతున్నారని విమర్శించారు. రెండు మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు  బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఆ పార్టీ ఇంచార్జీ అభయ్ పాటిల్, నేతలు చంద్రశేఖర్ తివారి, బంగారు శృతి, గౌతమ్ రావుపాల్గొన్నారు.