- కేసీఆర్, కేటీఆర్‌పై పెట్టిన ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ కేసులు ఏమైనయ్: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ‘‘కేసీఆర్, కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తున్నది. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా–ఈ కేసుల్లో బీఆర్‌ఎస్ నాయకులను రక్షిస్తున్నది” అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు. ఈ మేరకు రాంచందర్ రావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అందులో ప్రశ్నించారు.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ఇతర అధికారులపై చర్యలేవీ? అని నిలదీశారు. ‘‘రాష్ట్రాన్ని పదేండ్లు బీఆర్ఎస్ దోచుకున్నది. ఇప్పుడు అదే దారిలో కాంగ్రెస్ వెళ్తున్నది. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుని, నింద మాత్రం బీజేపీపై మోపుతున్నాయి. కాళేశ్వరం కేసును ఏడాదిన్నర పాటు సాగదీసి.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రేవంత్ సర్కార్ వ్యవహరించింది. ఆనాడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కాపాడినట్టే.. ఇప్పుడు బీఆర్ఎస్‌ను అనేక కేసుల నుంచి కాంగ్రెస్ కాపాడుతున్నది” అని ఆరోపించారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. మతం పేరుతో విభజించి రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేస్తోందన్నారు.
