
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై బీజేవైఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి నిరుద్యోగా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పిలుపు మేరకు.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్ నియోజకవర్గాలకు చెందిన బీజేవైఎం నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాకు దిగిన నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ మాట్లాడుతూ.. దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల సహాయం కాకుండా.. వారి కుటుంబాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు నియామకాలు వస్తాయని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఆత్మబలిదానం చేసుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని.. కేసీఆర్ మెడలు వంచి అయినాసరే ఉద్యోగాలు సాధిస్తామని ఆయన అన్నారు.
కాగా.. పోలీసులు బైక్ ర్యాలీని అడ్డుకోవడంతో.. కార్యకర్తలందరూ బైక్ ర్యాలీకి కాకుండా.. తక్షణం ప్రగతి భవన్ ముట్టడికి రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆఫీస్, ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు బీజేపీ కార్యాలయం నుంచి బీజేవైఎం నేతలు ప్రగతి భవన్‌కు బయలుదేరారు. బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు వ్యూహన్ని చేధించుకొని నాయకులు ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లారు. ఎల్బీనగర్ నగర్ నుంచి జేఎన్టీయూ వెళ్లే వారు ప్రగతి భవన్ రావాలని భాను ప్రకాష్ పిలుపునిచ్చారు. బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరణతోనే ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. దాంతో ప్రగతి భవన్ వైపు వస్తోన్న బీజేవైఎం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అయినాసరే.. బీజేవైఎం నేతలు మాత్రం దశల వారీగా ప్రగతిభవన్ వైపు వస్తున్నారు.