ఐనోళ్లతో పంచాయితీ! సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త సంబంధీకులు, బంధువులు

ఐనోళ్లతో పంచాయితీ! సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త సంబంధీకులు, బంధువులు
  • ఒకరిపై ఒకరు బరిలోకి దిగిన
  • అన్నదమ్ములు, యారాండ్లు, మామాఅల్లుళ్లు 
  • పోటాపోటీగా నామినేషన్లు.. విత్​డ్రాల కోసం ఒత్తిళ్లు 
  • గొడవలు.. విమర్శలు.. మనస్తాపాలు 
  • రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఇదే పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఈసారి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీపడుతున్న వారిలో రక్త సంబంధీకులు, దగ్గరి బంధువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒకే ఇంట్లో రెండు పార్టీల జెండాలు, ఒకే గడపలో రెండు వర్గాల ప్రచారాలు.. వెరసి ఆ కుటుంబాల్లో ప్రశాంతత కరువైంది. పదవి మోజులో పడి అన్నదమ్ముళ్లు, తోటికోడళ్లు, తండ్రికొడుకులు, అత్త కోడలు, మామ అల్లుడు అనే తేడా లేకుండా పోటీకి దిగుతుండటంతో.. ఎన్నికల ‘పంచాయితీ’ కాస్తా కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. ఓట్ల వేటలో రక్త సంబంధీకులు, బంధుత్వాల మధ్య వైరం పెరగడం చర్చనీయాంశమవుతోంది. 


ఆయా గ్రామాలకు సర్పంచ్, వార్డు మెంబర్ రిజర్వేషన్లు ఐదేండ్లకు ఒకసారి మారడం, ఎలాగైనా పంచాయతీలో పదవి దక్కించుకోవాలనే ఆరాటంలో ఒకే కుటుంబం నుంచి, పాలోళ్ల నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు. కలిసి పెరిగిన వ్యక్తులే ఇప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. కొన్నిచోట్ల డబ్బు, మద్యం పంపిణీ విషయంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ వార్డు స్థానం బరిలో ఉన్న ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు రాత్రివేళ ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. గ్రామాల్లో రిజర్వేషన్లు ఖరారైన నాటి నుంచి మొదలైన హడావుడి నామినేషన్ల ఘట్టానికి వచ్చేసరికి తారస్థాయికి చేరింది. కలిసి పెరిగినవారే ఇప్పుడు పదవి కోసం ఒకరినొకరు దూషించుకునే పరిస్థితి వచ్చింది. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ కు కేటాయించడంతో.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిపై, ఆస్తి పంపకాల్లో వచ్చిన మనస్ఫర్ధల నేపథ్యంలో ఆయన మేనల్లుడే పోటీకి దిగాడు. ఈ ఇద్దరి గొడవలో కుటుంబ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. తండ్రికి మద్దతివ్వాలా, భర్తకు ఓటేయాలా తెలియక ఆ ఇంటి ఆడబిడ్డ సతమతమవుతోంది.  

కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు 

మహిళా రిజర్వేషన్లు ఉన్న స్థానాల్లో పరిస్థితి మరీ విడ్డూరంగా ఉంది. అత్తాకోడళ్లు, తోడికోడళ్లు, వదినామరదళ్లు పోటీపడ్తున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు వేర్వేరు పార్టీల తరఫున పోటీ పడుతుండటంతో.. వంటింటి గొడవలు కాస్తా రచ్చబండకు ఎక్కుతున్నాయి. నిన్నటి వరకు ఇంటి పనుల్లో సాయం చేసుకున్నవారు, ఇప్పుడు ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. కొన్ని చోట్ల భర్తల ప్రోద్బలంతో భార్యలు పోటీకి దిగుతుంటే, మరికొన్ని చోట్ల మహిళలే స్వతహాగా తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. 

రక్త సంబంధీకుల మధ్య పోరు మొదలైనప్పుడు, కుటుంబంలోని పెద్దలు, తటస్థంగా ఉన్న ఇతర బంధువులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ‘‘నా కొడుకు ఒకవైపు, నా సోదరుడి కొడుకు మరోవైపు పోటీలో ఉన్నారు. ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉన్నాం. ఇప్పుడు ఎవరి వైపు ఉండాలనే దానిపై నాతోపాటు నా తమ్ముడి పరిస్థితి ఒకేలా ఉంది’’ అని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చెందిన ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

అన్నదమ్ముల సవాల్.. బంధువుల పరేషాన్  

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపూర్ సర్పంచి పదవి కోసం సొంత అన్నదమ్ములు చెరో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అన్న కొమ్ము గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ సపోర్ట్ తో నామినేషన్ వేస్తే, తమ్ముడు కొమ్మ రాజు యాదవ్ కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగాడు. నామినేషన్ల విత్​డ్రా తర్వాత పోటీలో వీళ్లిద్దరే మిగిలారు. గ్రామంలో 1,700పైగా ఓటర్లు ఉండగా.. వీరిలో మెజార్టీ యాదవులు, ఆ తర్వాత ఎస్సీలు ఉన్నారు. అయితే, గ్రామంలోని యాదవులు ఈ ఇద్దరు అన్నదమ్ములకు బంధువులు అవుతారు. దీంతో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేక పరేషాన్ అవుతున్నామని వారు చెప్తున్నారు.  

ఎన్నికల బరిలో తల్లీకూతుళ్లు

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ఐదో వార్డులో తల్లీకూతుళ్లు బరిలోకి దిగారు. తల్లి జక్కోజు సరోజనను బీజేపీ బలపరచగా.. కూతురు ముషిక చైతన్యను బీఆర్ఎస్ బలపరిచింది. తల్లీకూతుళ్లు ఒకరిపై ఒకరు పోటీకి దిగడం చర్చకు దారితీసింది. ముగ్గురు పిల్లలు ఉన్నారనే కారణంగా తల్లి సరోజన ఇన్నాళ్లు ఎలక్షన్ కు దూరంగా ఉంటే యువతకు అవకాశం ఇవ్వాలని కూతురు అంటున్నది. పోటీ అంతా ఎలక్షన్ వరకు మాత్రమేనని, ఆ తర్వాత ప్రజా సమస్యలపైనే దృష్టిపెడతామని ఇద్దరూ చెప్తున్నారు. 

యారాండ్లు.. సై అంటే సై 

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ సర్పంచ్ స్థానానికి ఇద్దరు యారాండ్లు తలపడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో కొత్తపల్లి చంద్రకళ పోటీలో ఉండగా, ఆమె తోడికోడలు కొత్తపల్లి కళ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ నాయకత్వానికే సవాల్ విసిరింది. గతంలో వీరి మామ కొత్తపల్లి రాజయ్య సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించారు.