- పర్యాటకులు సంగమేశ్వరం దర్శనానికి వెళ్లవద్దని హెచ్చరిక
కొల్లాపూర్, వెలుగు: కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి సంగమేశ్వరం ఆలయానికి నడిచే బోటింగ్ సేవలను అధికారులు తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేశారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రమ్ సింగ్ పాటిల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ ఆదివారం తెలిపారు.
నదిలో వరద ఉధృతి కొనసాగుతున్నందున పర్యాటకులు ఎవరూ సంగమేశ్వర ఆలయ దర్శనం కోసం సోమశిలకు వచ్చి ఇబ్బందులు పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వరద పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి, వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే బోటింగ్ సేవలను పునఃప్రారంభించడంపై తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
