ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బాబ్ సింప్సన్ కన్నుమూత

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బాబ్ సింప్సన్ కన్నుమూత

మెల్‎బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ దేశ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ (89) మరణించారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న సింప్సన్ ఆరోగ్యం విషమించి శుక్రవారం (ఆగస్ట్ 15) తుది శ్వాస విడిచారు. బాబ్ సింప్సన్ మరణాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ధృవీకరించింది. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపింది. 

1957లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన సింపన్స్ అనతి కాలంలోనే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్‎గా ఎదిగాడు. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియా జట్టు తరుఫున అధిపత్యం చెలాయించారు. తన కెరీర్‎లో మొత్తం 62 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్ రౌండర్ 4,869 పరుగులు చేసి 71 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 10 సెంచరీలు ఉండటం గమనార్హం. 

39 టెస్ట్‌లకు ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‎గా వ్యవహరించాడు సింప్సన్. 40 ఏళ్ల వయసులో క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఆల్ రౌండర్ మళ్లీ వెంటనే రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు. తర్వాత ఏడాది పాటు మాత్రం ఆటలో కొనసాగి 41 ఏళ్లలో ఆటకు పూర్తిగా గుడ్ బై చెప్పేశాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన ఆటతో ఆయన బంధాన్ని కోల్పోలేదు. ఆటగాడికి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత సింప్సన్ కోచ్ అవతారమెత్తాడు. 

ఆటలో రాణించినట్లుగానే కోచింగ్‎లోనూ జట్టును విజయవంతంగా నడిపించాడు. సింప్సన్ కాలంలో ఆస్ట్రేలియా జట్టుకు కొత్త ప్రొఫెషనల్ శకానికి నాంది పలికింది. జట్టులో సమూల మార్పులు తీసుకొచ్చి ఆటగాళ్లలో క్రమశిక్షణ, పోటీతత్వాన్ని పెంపొందించాడు. 1987లో సింపన్స్ కోచ్‎గా ఉన్న సమయంలోనే ఆస్ట్రేలియా మొదటి వరల్డ్ కప్ గెలిచింది. సింప్సన్ 1985లో స్పోర్ట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్‌, 2006లో ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌, 2013లో ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌ వంటి అరుదైన గౌరవం పొందాడు.