‘బోయింగ్ 737 మాక్స్’ 8 విమానాలను భారత్ నిషేధం విధించింది. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు మాక్స్ 8 విమానాలు ఎయిర్ పోర్టుల్లోనే నిలిపి ఉంచాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలతో విమానయాన శాఖ కార్యదర్శి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. విమానాలపై బ్యాన్ విధించడంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కాసేపు గందరగోళం నెలకొంది. తమ విమానం రద్దు కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇథియోపియాలో ఈనెల 10న ఇదే మోడల్ ఫ్లైట్ కూలి ….157 మంది మృతి చెందడంతో ఈ విమానాల పనితీరుపై అనుమానాలు తలెత్తాయి. గతేడాది అక్టోబర్ లో ఇండోనేషియా సముద్రంలో బోయింగ్ 737 మాక్స్ 8 విమానం కూలిపోయిన ఘటనలో 189 మంది చనిపోయారు. ఆరు నెలల టైంలోనే ఈ మోడల్ విమానాలు రెండు కూలిపోవడంతో ….సాఫ్ట్ వేర్, ఇంజిన్, సెన్సార్ల పనితీరుపై అనుమానాలు వస్తున్నాయి. దీంతో చాలా దేశాలు ఈ ఫ్లైట్లను విమానాశ్రయాలకే పరిమితం చేశాయి. ఆ లిస్టులో తాజాగా భారత్ కూడా చేరింది. బ్రిటన్ , ఫ్రాన్స్ , జర్మనీ, సింగపూర్ , చైనా, మలేసియా, ఇథియోపియా, ఆస్ట్రేలియా సహా చాలా దేశాలు ఈ విమానాన్ని బ్యాన్ చేశాయి. ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, అన్నీ పరిశీలించే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని భారత పౌర విమానయానశాఖ తెలిపింది.
