ఒడిశా నుంచి సిటీకి హాష్ ఆయిల్

ఒడిశా నుంచి సిటీకి హాష్ ఆయిల్
  •     ముగ్గురిని అరెస్ట్ చేసిన బొల్లారం పోలీసులు
  •     రూ.15 లక్షల విలువైన 3 కిలోల ఆయిల్ స్వాధీనం

సికింద్రాబాద్, వెలుగు : గంజాయితో తయారైన హాష్ ఆయిల్ ను అమ్ముతున్న ముగ్గురిని బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని మంగళవారం బొల్లారం పీఎస్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా రాలెగడ గ్రామానికి చెందిన హంతల్ బాలరాజ్(20) రెండో తరగతి వరకు చదివాడు. బాలరాజ్ కు తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తండ్రి చనిపోగా బాలరాజ్ తన వ్యవసాయ భూమిలో కూరగాయలు, కాఫీ తోట సాగు చేస్తున్నాడు. ఓ వైపు వ్యవసాయం చేస్తూనే కుటుంబపోషణకు అవసరమైన డబ్బుల కోసం కూలీ పనికి వెళ్లేవాడు.

ఆర్థిక సమస్యలు ఎక్కువగా కావడంతో ఈజీ మనీ కోసం తన భూమిలో టమాట పంటతో పాటు గంజాయి మొక్కలను పెంచడం మొదలుపెట్టాడు. ఆ గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించడం కష్టమైన పనిగా భావించిన బాల్ రాజ్ వాటి నుంచి హాష్ ఆయిల్ తీసి ట్రాన్స్ పోర్టు చేయాలని డిసైడ్ అయ్యాడు. గంజాయి మొక్కలు పెరిగిన తర్వాత వాటి నుంచి హాష్​ఆయిల్ తీసి ఇంట్లో నిల్వ చేశాడు.  ఈ ఆయిల్ ను హైదరాబాద్ లో అమ్మాలనుకుని ఆ విషయాన్ని తన బావ సుఖ్​దేవ్ ఖోరా(25)కు చెప్పాడు. హైదరాబాద్ లో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటుందని భావించిన బాలరాజ్

సుఖ్​దేవ్ ఏపీలోని అల్లూరి జిల్లా సీలేరులోని వల్సగడ్డ గ్రామానికి చెందిన గెమ్మెలి రాంబాబు(23)ను కలిసి విషయం చెప్పారు. ఈ ముగ్గురు కలిసి గ్యాంగ్ గా ఏర్పడ్డారు. గంజాయి నుంచి తయారు చేసిన 3 కిలోల హాష్ ఆయిల్ ను మూడు ప్యాకెట్లలో ప్యాక్ చేశారు. ముగ్గురు కలిసి బైక్ పై ఈ నెల 4న ఒడిశా నుంచి చింతూరు, భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ కు బయలుదేరారు. మంగళవారం సిటీకి చేరుకున్నారు.

అల్వాల్ మీదుగా సికింద్రాబాద్ కు వెళ్తుండగా.. బొల్లారం వద్ద పోలీసులు వెహికల్ చెకింగ్ చేయడాన్ని గమనించిన బాలరాజ్ వెంటనే బైక్ ను యూటర్న్ తీసుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసులు బైక్ ను వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15 లక్షల 50 వేల విలువైన 3 కిలోల హాష్ ఆయిల్, బైక్, సెల్ ఫోన్ ను  స్వాధీనం చేసుకున్నారు.   

కొంపల్లిలో గంజాయి చాక్లెట్లు

 జీడిమెట్ల:  గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరిని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంపల్లిలోని జైన్ కన్ స్ట్రక్షన్స్ వద్ద ఉన్న లేబర్ క్యాంప్ లో గంజాయి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం అక్కడ తనిఖీలు చేశారు. యూపీకి చెందిన రాజ్ కుమార్, విమల్ కుమార్ వద్ద 2.2 కిలోల గంజాయి, 750 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి చాక్లెట్లను యూపీ నుంచి తెచ్చామని.. ఎండు గంజాయిని నానక్ రాంగూడలోని నేహా అనే మహిళ వద్ద కొన్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.