నుపుర్ శర్మకు మద్దతుగా కంగనా రనౌత్‌

నుపుర్ శర్మకు మద్దతుగా కంగనా రనౌత్‌

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలవుతున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ అండగా నిలిచారు. నుపుర్​తో పాటు ఆమె కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు రావడాన్ని ఖండించారు. భౌతిక హాని తలపెట్టడం తగదని కంగనా చెప్పారు. 

మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నుపుర్ తో పాటు బీజేపీపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నుపుర్‌ శర్మకు కంగనా రనౌత్‌ మద్దతు పలికారు. అభిప్రాయాలను వెల్లడించే హక్కు  నుపుర్ కు  ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు.  టీవీ ఛానెల్‌ చర్చలో నుపుర్‌ చేసిన వ్యాఖ్యలతో విభేదించేవారు ఆమెకు వ్యతిరేకంగా చట్టబద్ధమైన చర్యలను ఆశ్రయించాలని సూచించారు. భౌతిక హాని తలపెట్టడం తగదన్నారు. ‘ఇది అఫ్గానిస్థాన్‌ కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేసే ప్రభుత్వం ఇక్కడ ఉందని ఎవరూ మరచిపోవద్దు' అని పోస్ట్ చేశారు. 

నుపుర్‌ శర్మ ఫిర్యాదుతో ఆమెకు, ఆమె కుటుంబానికి భద్రత కల్పించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించిన కొన్ని గంటల వ్యవధిలోనే కంగనా రనౌత్‌ ఈ ప్రకటన చేశారు. మరోవైపు, నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. వీరి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇస్లామిక్‌ దేశాలన్నీ ప్రకటనలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ముస్లిం దేశాలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి. తాజాగా ఇరాక్‌, లిబియా, మలేసియా, తుర్కియే(టర్కీ)లతో పాటు ఈజిప్ట్‌లోని అరబ్‌ పార్లమెంటు నిరసన తెలిపాయి.

మరోవైపు.. నుపుర్ శర్మకు మహారాష్ట్రలోని ముంబ్రా పోలీసులు సమన్లు  జారీ చేశారు. దీనితో జూన్ 22న ఆమె పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. ఆమెపై ముంబ్రా, పైడోనీ, థానేలో కేసులు నమోదయ్యాయి. రజా అకాడమీ ముంబై విభాగం జాయింట్ సెక్రటరీ ఇర్ఫాన్ షేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దక్షిణ ముంబైలోని పైడోనీ పోలీసులు నూపుర్ శర్మపై కేసు నమోదు చేశారు.

క్షమాపణలు కోరిన నుపుర్ శర్మ
బీజేపీ పార్టీ సస్పెండ్‌ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. నుపుర్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరినా అరబ్ దేశాలు శాంతించడం లేదు.