నింబోలి అడ్డలో భయపెట్టిన కారు.. బాంబులు ఉన్నాయేమోనని స్థానికుల భయాందోళన

నింబోలి అడ్డలో భయపెట్టిన కారు..  బాంబులు ఉన్నాయేమోనని స్థానికుల భయాందోళన
  • రైల్వే బ్రిడ్జి కింద అడ్డంగా పార్క్​ చేసి వెళ్లిన వ్యక్తి    
  • బాంబు స్క్వాడ్ బృందాల తనిఖీ
  • ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జనం

బషీర్​బాగ్, వెలుగు: తాగిన మత్తులో ఓ వ్యక్తి కారును నిర్లక్ష్యంగా రైల్వే బ్రిడ్జి కింద అడ్డంగా పార్కింగ్​చేసి వెళ్లిపోగా, అందులో బాంబులు ఉన్నాయేమోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసి, ఏమీ లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన బాలాజీ తన కారును బుధవారం డ్రైవింగ్ కోసం సమీర్ అనే వ్యక్తికి ఇచ్చాడు. 

గురువారం రాత్రి 7:30 గంటల సమయంలో సమీర్ మద్యం మత్తులో కారును నింబోలి అడ్డ రైల్వే బ్రిడ్జి కింద బాలికా సదన్ సమీపంలో రోడ్డు  అడ్డంగా నిలిపాడు. కారులో లైట్లు ఇండికేటర్ వేసి వెళ్లాడు. కారు రోడ్డుకు అడ్డంగా నిలిపివేయడంతో చాదర్​ఘాట్–- గోల్నాక అంబర్ పేట్ వైపు ట్రాఫిక్ స్తంభించింది. 

ఇటీవల ఢిల్లీలో బాంబు పేలుడు జరగడంతో ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..  బాంబు స్క్వాడ్  బృందాలను రప్పించి కారును పూర్తిగా తనిఖీ చేయించారు. అందులో ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

కాగా, కారును అక్రమంగా పార్కు చేసి భయాందోళనకు గురిచేసిన కారు యజమాని, పార్కు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. ఢిల్లీలో బాంబు పేలుడు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.