
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డెకథ్లాన్ స్పోర్ట్స్ స్టోర్ రూమ్ కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. స్టోర్ లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి సోమవారం బెదిరింపు కాల్ వచ్చింది. రిమోట్ బాంబ్ పెట్టినట్లు బెదిరించిన అగంతకుడు.. కోటి రూపాయలు ఇవ్వాలని లేకుంటే రిమోట్‌తో బాంబును పేల్చేస్తామని హెచ్చరించాడు. దీంతో అలర్టైన స్టోర్ లో వున్న ఉద్యోగులను, కస్టమర్లను స్టోర్ యాజమాన్యం బయటకు పంపినట్టు చెబుతున్నారు. ఎయిర్ పోర్ట్ పోలీసులకు యాజమాన్యం సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. విస్తృత తనిఖీల తర్వాత బాంబు లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో స్టోర్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. తర్వాత ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.