- ఈ వారంలో ఇది మూడోసారి
- తనిఖీలు చేసి ఫేక్ మెయిల్ గా నిర్ధారించిన పోలీసులు
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో బాంబులు పెట్టామని మెయిల్ చేయడంతో కొద్ది సేపు భయాందోళనలు నెలకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాల నుంచి జడ్జీలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించి బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో రెండు గంటల సేపు కోర్టు సేవలు నిలిచిపోయాయి. గత బుధ, శుక్రవారాల్లో సీబీఐ కోర్టుకు వచ్చిన మెయిల్ నుంచే ఈసారి క్రిమినల్ కోర్టు సూపరింటెండెంట్ కు మెయిల్ వచ్చింది.
ఉదయం 11:50 గంటలకు కోర్టులో సైనైడ్ పాయిజన్ గ్యాస్, ఆర్డీఎక్స్ పేలుడు జరుగుతుందని, 11 గంటల్లోగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలను ఖాళీ చేయించండి అంటూ హెచ్చరించారు. ఉగ్రవాది అజ్మల్ కసాబ్ ను పట్టుకొని, అతనికి ప్రభుత్వం ద్వారా న్యాయవాదిని నియమించారని, తమిళనాడులోని శివగంగా జిల్లాకు చెందిన అజిత్ కుమార్ ను ఓ కేసులో అరెస్ట్ చేసి పోలీసులు విచారణలో చంపేశారని మెయిల్ లో ఆరోపించాడు. ఉగ్రవాదికి న్యాయం, సామాన్య పౌరుడికి కస్టడీలో మరణమా? అని ప్రశ్నించాడు. అందుకే తాము ఈ పేలుడుకు పాల్పడుతున్నట్లు మెయిల్ లో పేర్కొన్నాడు.
తనిఖీల అనంతరం ఫేక్ మెయిల్ గా పోలీసులు గుర్తించారు. తరుచూ ఫేక్ మెయిల్స్ పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక టెక్నికల్ టీమ్స్ పని చేస్తున్నాయని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
