- 12 ఆర్డీక్స్ లు పెట్టామని మెయిల్స్
బషీర్బాగ్/కరీంనగర్ క్రైం, వెలుగు: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఉదయం 9.05 గంటలకు నాంపల్లిలో సీబీఐ కోర్టు సూపరింటెండెంట్, కరీంనగర్‌లోని జిల్లా జడ్జీకి మెయిల్స్వచ్చాయి. కోర్టులో12 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 12:05 గంటలకు పేలుతాయని మెయిల్‌లో పేర్కొన్నారు. కానిస్టేబుల్స్ తో పాటు కోర్టు సిబ్బందిని వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అందుకే ఇలా చేస్తున్నామని తెలిపారు. బాంబులు పేలకపోతే కోర్టు ప్రాంగణంలోకి చొరబడి ఆత్మహుతికి పాల్పడతామన్నారు.
మెయిల్స్ చదివిన కోర్టు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి కోర్టులోంచి జడ్జీలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేశారు.బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
