‘గంగూబాయి’ విడుదలకు తొలగిన అడ్డంకులు

‘గంగూబాయి’ విడుదలకు తొలగిన అడ్డంకులు

ముంబై: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడీ’. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ దాఖలైన మూడు పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టేసింది. దీంతో గంగూబాయి రిలీజ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. ఇకపోతే, ముంబయిలోని మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితం ఆధారంగా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించాడు. 

ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వేశ్యగా జీవితం మొదలు పెట్టాల్సి వచ్చినా.. వాటన్నింటినీ ఎదుర్కొని మాఫియా డాన్‌గా ఎదిగిన గంగూబాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ‘గంగూబాయి’ సినిమాపై కతియావాడీకి చెందిన ఓ మహిళ కేసు వేసింది. ఈ మూవీ వల్ల కతియావాడీలో ఉండే మహిళల్ని వేశ్యలుగా చూస్తున్నారని.. తమ కుటుంబాల గౌరవానికి భంగం కలుగుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. గంగూబాయి రిలీజ్ ను ఆపాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిన్ పటేల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కమాఠిపూర ప్రాంతాన్ని సినిమాలో రెడ్ లైట్ ఏరియాగా చూపించారని పిల్ లో అమిన్ పటేల్ చెప్పారు. ఈ రెండు పిటిషన్లతోపాటు గంగూబాయి విడుదలపై స్టే విధించాలని మరో పిటిషన్ దాఖలైంది. మూవీ ట్రైలర్ లోని ఓ సీన్ ఈశాన్య భారత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆ వ్యాజ్యంలో పిటిషనర్ పేర్కొన్నారు. అయితే వారి వాదనలతో ఏకీభవించని బాంబే హైకోర్టు పిటిషన్లను కొట్టేసింది. 

మరిన్ని వార్తల కోసం..

ఆ మూడు రోజులు తాజ్ మహల్‌ను ఫ్రీగా చూడొచ్చు

యువీ.. నీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం