
జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముంబైలో మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చింది బాంబే హైకోర్టు . జూన్ 4 న రిజల్ట్ వెలువడుతున్నందున ఆ రోజు మొత్తం డ్రై డేగా నిర్ణయించారు . అయితే ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉందంటూ హోటళ్లు, రెస్టారెంట్లు, పర్మిట్ రూమ్‌లు .. బార్‌ల యజమానుల సంఘం ( AHAR ) బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ముంబై నగరం.. సబర్బన్ కలెక్టర్లు జారీ చేసిన ఉత్తర్వులపై రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది.
ముంబై నగర కలెక్టర్ , ముంబై జిల్లా సబర్బన్ కలెక్టర్‌ను సంప్రదించి జూన్ 4 రోజంతా డ్రై డేగా ప్రకటించే నిర్ణయాన్ని సమీక్షించాలని పిటిషనర్లు కోరారు. మద్యం విక్రయించే సంస్థలను రోజంతా కాకుండా ఫలితాల ప్రకటన తర్వాత వ్యాపారానికి అనుమతించేలా కలెక్టర్ల ఉత్తర్వులను సవరించాలని కోరారు. ఈ పిటిషన్లను ఇవాళ విచారించిన బాంబే హైకోర్టు జూన్ 4న ఫలితాలు వచ్చిన తర్వాత మద్యం షాపులు ఓపెన్ చేసుకోవడానికి అనుమతిచ్చింది.