అనిల్ దేశ్‌ముఖ్ కు బెయిల్ మంజూరు.. సంబరాల్లో నేతలు

అనిల్ దేశ్‌ముఖ్ కు బెయిల్ మంజూరు..  సంబరాల్లో నేతలు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేశ్‌ముఖ్‌ను 2021 నవంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. అతను రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేశారని, కొంతమంది పోలీసు అధికారుల ద్వారా ముంబయిలోని వివిధ బార్‌, హోటళ్ల నుండి రూ. 4.70 కోట్లు వసూలు చేశారనే ఆరోపణ ఉంది. అక్టోబరు 21న దేశ్‌ముఖ్‌ బెయిల్‌ పిటిషన్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు తిరస్కరించడంతో అదే నెల 26న ఈ కేసుకు సంబంధించి బెయిల్ కోసం అనిల్ దేశ్ ముఖ్.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

అంతకుముందు.. అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్ దరఖాస్తును తిరస్కరించిన సీబీఐ కోర్టు.. విచారణలో సచిన్ వాజే వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ఈ సమయంలోనే ముంబయిలోని బార్ యజమానుల నుంచి ప్రతి నెలా  రూ. 100 కోట్లు అక్రమంగా వసూలు చేయాలని పోలీసులను అడిగారనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఎన్సీపీ నేత అనిల్ దేశ్ ముఖ్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ..డ్యాన్సులు చేశారు.