Border 2: గల్ఫ్ దేశాల్లో ‘బార్డర్ 2’కి నో ఎంట్రీ.. ధురంధర్’ తరహాలోనే బ్యాన్.. ఎందుకిలా జరుగుతుంది?

Border 2: గల్ఫ్ దేశాల్లో ‘బార్డర్ 2’కి నో ఎంట్రీ.. ధురంధర్’ తరహాలోనే బ్యాన్.. ఎందుకిలా జరుగుతుంది?

‘గదర్ 2’, ‘జాట్’ సినిమాల సక్సెస్ జోష్లో ఉన్న సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘బోర్డర్ 2’. ఇవాళ శుక్రవారం (2026 జనవరి 23న) మూవీ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. డైరెక్టర్ అనురాగ్ సింగ్ తెరకెక్కించిన వార్ యాక్షన్ డ్రామా ‘బార్డర్ 2’కు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

1971 నాటి ఇండో–పాక్ యుద్ధ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేక్షకులు, నెటిజన్లు ఈ సినిమాను “బ్రిలియంట్ మూవీ”, “దేశభక్తి సినిమా అంటే ఇదే” అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా సన్నీ డియోల్ నటన వేరే లెవల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యుద్ధ సన్నివేశాల్లో ఆయన చూపించిన ఎమోషన్, ఇంటెన్సిటీ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు.

ఇండియాతో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లలో ‘బోర్డర్ 2’కు మంచి ఓపెనింగ్ లభిస్తున్నప్పటికీ, గల్ఫ్ దేశాల్లో మాత్రం ఈ చిత్రానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాను ఆరు గల్ఫ్ దేశాల్లో ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇదే తరహాలో గతంలో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ కూడా మిడిల్ ఈస్ట్‌లో విడుదల కాకపోవడం గమనార్హం.

గల్ఫ్ దేశాల్లో ఎందుకు విడుదల కాలేదు?

బాలీవుడ్ నివేదికల ప్రకారం, ‘బోర్డర్ 2’ను బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల్లో ప్రదర్శించనీయలేదు. “పాకిస్తాన్‌ను ప్రతికూలంగా చూపించే సినిమాలకు ఈ ప్రాంతంలో సాధారణంగా అనుమతి ఉండదు” అని పలు కథనాలు ధృవీకరించాయి.

►ALSO READ | Samantha: ట్రైనర్ కే చెమటలు పట్టించిన సమంత.. వీడియో వైరల్!

అయితే, అధికారికంగా ‘బ్యాన్’ ప్రకటించకపోయినా, పాకిస్తాన్‌పై నెగటివ్ భావన ఉన్న చిత్రాలను గల్ఫ్ దేశాలు ప్రదర్శించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపాయి. ఈ అనధికారిక విధానం వల్లే ‘బోర్డర్ 2’ అక్కడి ప్రేక్షకులకు చేరలేకపోయింది.

అయినా బాక్సాఫీస్ ఆశలు పుష్కలమే

గల్ఫ్ మార్కెట్‌లో విడుదల కాకపోయినా, భారత్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రాంతాల్లో ‘బోర్డర్ 2’ మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘బోర్డర్’ సినిమాకు ఉన్న భారీ క్రేజ్, స్టార్ క్యాస్ట్ ఆకర్షణ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.

‘ధురంధర్’కూ ఇదే పరిస్థితి

రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే, ఈ సినిమాను కూడా UAE, సౌదీ అరేబియా సహా పలు గల్ఫ్ దేశాల్లో ప్రదర్శించలేదు. ఈ నిషేధం కారణంగా ‘ధురంధర్’కు దాదాపు ₹90 కోట్ల (సుమారు 10 మిలియన్ డాలర్లు) ఓవర్సీస్ ఆదాయం కోల్పోయినట్లు డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా వెల్లడించారు. సాధారణంగా గల్ఫ్ మార్కెట్ భారతీయ యాక్షన్ సినిమాలకు చాలా కీలకమని ఆయన తెలిపారు.

ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను చూపించిన విధానం ఈ నిషేధానికి కారణంగా భావిస్తున్నారు. అయినప్పటికీ, ‘ధురంధర్’ భారత్‌తో పాటు ఇతర దేశాల్లో భారీ విజయాన్ని సాధించింది.