బీఆర్ఎస్​ పార్టీకి బోర్డర్​ సెగ్మెంట్ల టెన్షన్

బీఆర్ఎస్​ పార్టీకి బోర్డర్​ సెగ్మెంట్ల టెన్షన్
  • ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్‌‌‌‌
  • గతంలోనూ ఇక్కడ కాంగ్రెస్​ గెలుపు 
  • పోడు, అసైన్డ్​ భూములు, ధరణికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మావోయిస్టులు  
  • సానుభూతిపరుల కదలికలపై పోలీసుల నిఘా
  • పలువురి అరెస్టులు 

జయశంకర్‌‌ ‌‌భూపాలపల్లి, వెలుగు: బీఆర్ఎస్​కు సరిహద్దు టెన్షన్​ పట్టుకుంది. రూలింగ్​పార్టీ ఓటమే లక్ష్యంగా మావోయిస్టు సానుభూతిపరులు అడుగులు కదుపుతు న్నారు. దీని కోసం వారు భూపాలపల్లి, మంథని, ములుగు, భద్రాచలం, అసిఫాబాద్‌‌‌‌ అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ ​పెట్టారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ ​పార్టీ అభ్యర్థులే గెలిచారు. పోడు భూముల సమస్య, అసైన్డ్ ​భూముల వ్యవహారం, ధరణి వెబ్​సైట్​కి వ్యతిరేకంగా మావోయిస్టులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కరపత్రాలు పంచిపెట్టారు. దీంతో ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో రాష్ట్ర సర్కారు అలర్టయ్యింది. 

ఇంటెలిజెన్స్‌‌‌‌ హెచ్చరికలతో ఏజెన్సీ గ్రామాల్లో పోలీసుల నిఘా పెంచింది. అటవీ గ్రామాల్లో మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై నజర్​ పెట్టింది. చత్తీస్‌‌‌‌ గఢ్‌‌‌‌, మహారాష్ట్ర సరిహద్దు దాటి తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్‌‌‌‌ కూడా చేశారు. 

ALSO READ: కేసీఆర్..​ ముందు కామారెడ్డిలో మా సంగతి తేల్చు

చెప్పిందొకటి..చేసిందొకటి అని..

రాష్ట్ర సర్కారు పోడు భూముల విషయంలో చెప్పిందొకటి...చేసింది మరొకటి అని  మావోయిస్టులు మండిపడుతున్నారు. పోడు వ్యవసాయం చేసుకునే అర్హులైన పోడు రైతులకు పట్టాలిస్తామని చెప్పి కేవలం 4.06 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలివ్వడంపై ఆగ్రహంగా ఉన్నారు.

నిరుపేదలు, దళితులకు గతంలో ఇచ్చిన భూములు గుంజుకోవడం, అసైన్డ్‌‌‌‌ పట్టాలను లాక్కోవడం, ధరణి తెచ్చి మళ్లీ దొరలకే పట్టాలిచ్చారని, ఎప్పుడో ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిన దొరలు మళ్లీ ఊళ్లల్లోకి వస్తుండడంతో.. దీనికంతటికీ బీఆర్ఎస్​సర్కారే కారణమని కోపంగా ఉంది. 

ఈ క్రమంలో రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం లేకపోవడంతో ప్రతి గ్రామంలో ఉన్న ఆ పార్టీ సానుభూతిపరులను అలర్ట్‌‌‌‌ చేసినట్టు తెలిసింది. వారు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలవకుండా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌ గఢ్‌‌‌‌ రాష్ట్రాల సరిహద్దుకు దగ్గరగా ఉన్న మంథని, భూపాలపల్లి, భద్రాచలం, ములుగు, అసిఫాబాద్‌‌‌‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థులే గెలిచారు.

 తెలంగాణ వచ్చాక రెండోసారి జరిగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి వెనక మావోయిస్టుల ప్రభావం కూడా ఉందని ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో భూపాలపల్లి, ఆసిఫాబాద్‌‌‌‌ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలో చేరారు. ఈ క్రమంలో మళ్లీ పాత సీన్​ రిపీట్​ కాకుండా అధికార పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 

అలర్టయిన పోలీసులు

సానుభూతిపరులను అలర్ట్​ చేయడంతో పాటు తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం జయశంకర్​భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, అసిఫాబాద్‌‌‌‌ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలని చూస్తోంది. 

మావోయిస్టు నేత బడే చొక్కారావు అలియాస్​దామోదర్​ఉమ్మడి వరంగల్​ జిల్లా వాసి కావడంతో సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని కూడా పార్టీ నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నట్టు తెలుస్తోంది. 

దీన్ని గుర్తించిన పోలీసులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్పీ పుల్లా కరుణాకర్ ఆధ్వర్యంలో ఈ నెల15న మహారాష్ట్ర, చత్తీస్​గఢ్, తెలంగాణ రాష్ట్ర  పోలీసు ఉన్నతాధికారుల మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. అందులో మావోయిస్టుల కదలికలు,  ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. 

 ఈ క్రమంలో ఈ నెల 26న సాయంత్రం 5 గంటలకు చత్తీస్‌‌‌‌ గఢ్‌‌‌‌ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో తాము కూంబింగ్​జరిపామని ములుగు ఎస్పీ గాష్‌‌‌‌ ఆలం ప్రకటించారు. 

ఎదురుకాల్పులు కూడా జరిగాయని, తర్వాత మావోయిస్టులు పారిపోయారని చెప్పారు. వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న, బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌‌‌‌, బండి ప్రకాశ్‌‌‌‌ అలియాస్‌‌‌‌ దాదా అలియాస్‌‌‌‌ క్రాంతి, మైలారపు అడేలు అలియాస్ భాస్కర్, కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్​ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. 

మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌‌‌‌

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వారం రోజుల్లో ఏడుగురు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. చత్తీస్​గఢ్​రాష్ట్రం భీమారానికి వెళ్లి అక్కడ  మావోయిస్టులను కలిసి వారిచ్చిన మావోయిస్ట్ సాహిత్య రచనలను,ఊర్లో వేయడానికి కరపత్రాలు, మూడు జిలెటిన్ స్టిక్స్, మూడు డిటోనేటర్లు తీసుకొని వస్తుండగా ఈ నెల 23న భూపాలపల్లి పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌‌‌‌ చేశారు. 

ములుగు జిల్లా వాజేడు మండలంలో ఈ నెల 28న తనిఖీలు చేపడుతుండగా ఆటోలో ప్రెషర్ బాంబ్ తయారీకి కావలసిన పేలుడు సామాగ్రి, కార్డెక్స్ వైర్, డిటోనేటర్లు, బ్యాటరీలు తీసుకొని వెళ్తున్న ఇద్దరిని ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు.