
తండ్రి అరెస్టును తట్టుకోలేక కొడుకు పురుగుల మందు తాగిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గట్టు రాజాకు తాతల కాలం నుంచి సాగుచేస్తున్న అసైన్డ్ భూమి ఉంది. అయితే ఆ భూమిని డంపింగ్ యార్డ్ మరియు పార్కుకోసం గ్రామపంచాయతీ స్వాధీనం చేసుకుంది. ఆ భూమిలో అధికారులు మొక్కలు నాటడం కోసం వెళ్లగా రాజా అడ్డుకున్నాడు. దాంతో అధికారులు ముత్తారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజాను అదుపులోకి తీసకొని స్టేషన్ కు తీసుకెళ్లడంతో.. అధికారులు రాజా భూమిలో మొక్కలు నాటడానికి సిద్ధమయ్యారు. తండ్రిని పోలీసులు తీసుకెళ్లారని తెలుసుకున్న కొడుకు కోటేష్.. తమ భూమి దగ్గరికి వెళ్లి.. అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు కోటేష్ ను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన తండ్రిని పోలీసులు ఏమైనా చేస్తారనే భయంతోనే.. కోటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు.
For More News..