ఆదిపురుష్కు బాయ్ కాట్ సెగ.. ట్విట్టర్ ట్రెండ్

ఆదిపురుష్కు బాయ్ కాట్ సెగ.. ట్విట్టర్ ట్రెండ్

ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ సినిమాకు బాయ్ కాట్ సెగ తగిలింది. ఈ సినిమాను రిలీజ్ కానివ్వకుండా అడ్డుకోవాలని, సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్ ట్రెండ్ నడిచింది. రామాయణ గాధ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో చాలా తప్పులు జరిగాయని వాటిని విశ్లేషిస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.

ఆదిపురుష్  పోస్టర్ లో.. హనుమంతునికి పోనీటైల్ ఉందని, లక్ష్మణుడికి స్టయిలిష్ గా గడ్డం పెట్టారని, సీత నుదుటిన సింధూరం కాకుండా స్టిక్కర్ పెట్టారంటూ నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు. ఇలా చాలా తప్పులు ఉన్నాయని.. ఖచ్చితంగా ఇది చరిత్రను వక్రీకరించినట్టే అవుతుందని.. అందుకే ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

అంతేకాదు ఈ సినిమాలో రాముడికి మీసాలు పెట్టడాన్ని కూడా చాలా మంది తప్పుబడుతున్నారు. లంకకు వచ్చిన హనుమంతునికి సీత ఆనవాలుగా చూడామణికి బదులుగా గాజు ఇచ్చినట్టుగా చూపించారు. ఇది కూడా చాలా మందికి నచ్చలేదు. ఓంరౌత్ కు పురాణాల గురించి ఏం తెలుసని.. తన ఇష్టమొచ్చినట్టుగా మార్పులు చేశారని మండిపడుతున్నారు. 
 
కేవలం ఒక పోస్టర్, ట్రైలర్ లోనే ఇన్ని తప్పులు కనిపిస్తే.. సినిమాలో ఇంకెన్ని మార్పులు కనిపిస్తాయో అని మండిపడుతున్నారు నెటిజన్లు. ఎవరికీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మార్చుకోవడానికి అది మామూలు కథ కాదని, ఒక మహనీయుడి కథ అని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. నిజంగా సినిమాలో ఇలాంటి మార్పులే ఉంటే.. దాన్ని సహించం అంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్తుంది అనేది చూడాలి.

ఇక ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.