- గన్‌పార్క్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన జేఏసీ చైర్మన్ పవన్‌కుమార్ శర్మ
సైఫాబాద్, వెలుగు: తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బసవరాజు శ్రీనివాసును తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ఆత్మహత్యకు యత్నించారు. పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెతో అక్కడకు చేరుకున్న ఆయన బలవన్మరణానికి పాల్పడబోగా, అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఆయన సోషల్ మీడియాలో చేసిన ప్రకటనతో బ్రాహ్మణ సంఘాల నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ సంఘటన అనంతరం మాజీ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి గన్‌పార్క్‌కు చేరుకుని పవన్ కుమార్ శర్మకు ధైర్యం చెప్పారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, జీవించి ఉండి బ్రాహ్మణ హక్కుల కోసం పోరాడాలని సూచించారు.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో బసవరాజు శ్రీనివాస్ దళితులను, పేద బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడారని నాయకులు ఆరోపించారు. దీనిపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు అవుతున్నా బ్రాహ్మణుల సంక్షేమంపై శ్రద్ధ పెట్టలేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని బసవరాజు శ్రీనివాసును పదవి నుంచి తొలగించాలని బ్రాహ్మణ సంఘాలు స్పష్టం చేశాయి.
