తాను మరణిస్తూ..  ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపుతూ..

తాను మరణిస్తూ..  ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపుతూ..
  •     రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌‌ అయిన సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్‌‌‌‌ 
  •     లివర్, కిడ్నీలు, కళ్ల దానానికి ఒప్పుకున్న యువకుడి తల్లిదండ్రులు 

హైదరాబాద్, వెలుగు: తాను చనిపోతూ మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడో సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌.. హైదరాబాద్‌‌లోని అంబర్‌‌‌‌పేటకు చెందిన చిర్రాల రవిప్రకాశ్‌‌, శ్రీదేవిల కుమారుడు సంకీర్త్ (21) సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. మార్చి 25న నాగోల్ సమీపంలో బైక్‌‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి సంకీర్త్‌‌ చికిత్స పొందుతున్నాడు.

ఏప్రిల్ 9న సంకీర్త్‌‌ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో తమ కొడుకు శరీర రూపంలో లేకపోయినా, అవయవాల రూపంలో ఇతరుల్లో జీవించాలని భావించి అతడి తల్లిదండ్రులు అవయవదానానికి ముందుకొచ్చారు. జీవన్ దాన్ ప్రతినిధులు సంకీర్త్ లివర్, రెండు కిడ్నీలు, రెండు కళ్లను సేకరించారు. వీటిని ఐదుగురు బాధితులకు అమర్చి వారికి పునర్జన్మను ప్రసాదించారు. సంకీర్త్ కుటుంబాన్ని తెలంగాణ జీవన్‌‌దాన్ (ఎస్ఓటీటీఓ) సంస్థ కొనియాడింది.