
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలవివాదాలు పరిష్కరించేందుకు ఏర్పాటైన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కాల పరిమితిని ఏడాది పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తి మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఏడాది జులై 30తో ట్రిబ్యునల్ కాల పరిమితి ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది జులై 30వ తేదీలోగా రెండు రాష్ట్రాల వాదనలు పరిగణలోకి తీసుకొని నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్‌కు సూచించారు. కాగా, ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ -2014లోని సెక్షన్ 89 ప్రకారం ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా నీళ్లను రెండు రాష్ట్రాల మధ్య పున:పంపిణీ చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ ఏర్పాటైంది. కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలకు నీటి పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కేడబ్ల్యూడీటీ -2కు నేతృత్వం వహించిన జస్టిస్ బ్రజేశ్ కుమార్ ఈ ట్రిబ్యునల్‌కూ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా ట్రిబ్యునల్ విచారణ చేపట్టలేకపోయింది. అంతకుముందు ఒక సభ్యుడి రాజీనామాతో ఏడాది పాటు హియరింగ్‌లు నిర్వహించలేదు. దీంతో 2 రాష్ట్రాల జలవివాదాల విచారణ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ కాల పరిమితిని ఏడాది పొడిగించారు.