హైదరాబాద్ లో ఈవీ ఆటోల సేల్స్ కు బ్రేక్స్..పర్మిట్లు ఉన్నా అమ్మకాలు జరపని డీలర్లు!

హైదరాబాద్ లో ఈవీ ఆటోల సేల్స్ కు  బ్రేక్స్..పర్మిట్లు ఉన్నా అమ్మకాలు జరపని డీలర్లు!
  • ఈవీ ఆటోలపై  ఎందుకింత సందిగ్ధత!
  • గ్రేటర్​లో అమ్మకాలు చేయని డీలర్లు
  • ప్రభుత్వం 20 వేల ఈవీ ఆటోలకు పర్మిట్లు ఇచ్చినా నో సేల్స్
  •  సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలపైనే షోరూమ్​ నిర్వాహకుల ఆసక్తి
  • డీలర్లంతా సిండికేట్​గా మారారంటున్న ఆటో డ్రైవర్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఈవీ ఆటోల అమ్మకాలపై సందిగ్ధత వీడడం లేదు. ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రకటించినప్పటికీ ఆటోలు కొనాలంటే ఏదో తెలియని కారణం అడ్డు వస్తున్నది. ఔటర్​రింగ్ రోడ్​పరిధిలో 65 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో 20 వేలు ఈవీ ఆటోల పర్మిట్లే ఉండగా, వాటిని డీలర్లు అమ్మడం లేదు. ప్రస్తుతానికి సీఎన్జీ, ఎల్పీజీ ఆటోల అమ్మకాలపైనే షోరూమ్​నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. వీటి అమ్మకాల తర్వాతనే ఎలక్ట్రిక్​ఆటోలను అమ్మకాలు చేపట్టాలని కొందరు డీలర్లంతా సిండికేట్​గా​మారినట్లు ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.

అంతా ఈజీ కాదు..!

నగరంలో 20 వేల ఈవీ ఆటోలే కాకుండా మిగిలిన ఈవీ వెహికల్స్​ను ఓపెన్​మార్కెట్​లో అమ్మకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి కొన్ని నెలల కింద ఈవీ పాలసీని తీసుకొచ్చింది. అయినప్పటికీ ఈవీ టూవీలర్లు, కార్లు, ఇతర కమర్షియల్ వెహికల్స్​దొరికనంత ఈజీగా ప్రస్తుతం ఈవీ ఆటోలు ఓపెన్​మార్కెట్​లో దొరకడం లేదు. డీలర్ల వద్ద బుక్ చేసుకుందామంటే బుకింగ్ చేయడం లేదని ఆటోల డ్రైవర్లు చెప్తున్నారు. 

గ్రేటర్​లో కొత్త ఆటోలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్​ఆటోలను కూడా తప్పనిసరిగా ఆర్టీఏ అధికారుల నుంచి ప్రొసీడింగ్స్​ఉంటేనే షోరూమ్​నిర్వాహకులు అమ్ముతున్నారని తెలిపారు. 

ఈవీ ఆటోలకన్నా పర్మిషన్లు ఇవ్వాలి

గ్రేటర్​పరిధిలో కాలుష్యం పెరుగుతోందన్న కారణంగా కొత్త డీజిల్, పెట్రోల్ ఆటోలపై దాదాపు 20 ఏండ్ల కింద అధికారులు నిషేధం విధించారు. అప్పట్లో నగరంలో కేవలం 50 వేలలోపే ఆటోలు ఉండగా, గడిచిన ఇన్నాళ్లలో నిషేధం ఉన్నప్పటికీ మరో 50 వేల ఆటోలు పెరిగినట్టు అధికారులు తెలిపారు. ఇందులో కొన్నింటికి ప్రభుత్వమే ప్రత్యేక సందర్భాల్లో పర్మిట్లు ఇవ్వగా, మిగిలినవి ఇతర జిల్లాల నుంచి డ్రైవర్లు తెచ్చుకొని హైదరాబాద్​నడుపుతున్నవే. 

నగరంలో ఉన్న డ్రైవర్లు ఆటో కొనాలంటే పాత ఆటోను స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈవీ పాలసీ వచ్చినప్పటికీ వాటిని కొనుగోలు చేయాలన్నా అధికారుల నుంచి ప్రొసీడింగ్స్​అడుగుతున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. ఎటువంటి నిబంధనలు లేకుండా హైదరాబాద్​లో కనీసం ఈవీ ఆటోలకన్నా పర్మిట్లు ఇస్తే ఇక్కడి వారికి ఉపాధి దొరుకుతుందంటున్నారు. ఇదే విషయమై ఆర్టీఏ అధికారులను అడిగితే వారు మాత్రం దీనిపై మాట్లాడ్డానికే ఇష్టపడడం లేదు. ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు.