ఫస్ట్​ క్లాస్​ నుంచి టెన్త్ దాకా.. సర్కార్ బడుల్లో బ్రేక్ ఫాస్ట్

ఫస్ట్​ క్లాస్​ నుంచి టెన్త్ దాకా.. సర్కార్ బడుల్లో బ్రేక్ ఫాస్ట్

సర్కార్ బడుల్లో చదువుతున్న స్టూడెంట్లకు ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 24 (దసరా)  నుంచి ‘చీఫ్ మినిస్టర్ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ను అమలు చేస్తామని వెల్లడించింది. దీంతో ఒకటో తరగతి నుంచి పదో తరగతి స్టూడెంట్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం జీవో 27ను రిలీజ్ చేశారు. 

ఈ స్కీమ్ అమలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​ను ఆదేశించారు. ఈ స్కీమ్ అమలు కోసం సర్కార్​ ఏటా దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది. ఇటీవల వాకాటి కరుణ నేతృత్వంలోని అధికారుల బృందం తమిళనాడులో అమలవుతున్న బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పై స్టడీ చేసి వచ్చింది.

ALSO READ: కాంగ్రెస్​లోకి తుమ్మల, వీరేశం.. సోనియా సభలో భారీ చేరికలు!

ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో మిడ్ డే మీల్స్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు 28,807 సర్కార్, లోకల్ బాడీ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయనున్నారు. దీని ద్వారా 23,05,801 మంది స్టూడెంట్లకు లబ్ధి చేకూరనుంది.  ప్రతిరోజు ఉదయం స్టూడెంట్లకు పొంగల్, ఉప్మా, కిచిడీ, వెజిటేబుల్ బిర్యానీ తదితర టిఫిన్స్ పెట్టే యోచనలో సర్కారు ఉంది. కాగా, బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలుపై సీఎం కేసీఆర్ కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

మహిళా, శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆమె అన్నారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ స్కీమ్ అమలుతో విద్యార్థుల తల్లులకు పని భారం కూడా తగ్గుతుందన్నారు. స్కీమ్ అమలుపై పీఆర్టీయూటీఎస్, టీఎస్​యూటీఎఫ్, టీఆర్​టీఎఫ్ నేతలు సీఎం కేసీఆర్​ కు కృతజ్ఞతలు తెలిపారు.