
- 18 లక్షల మంది పేద విద్యార్థులకు అందించేలా స్కీమ్
- ఇప్పటికే చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
- ప్రపోజల్స్ రెడీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ ఫాస్ట్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో బ్రేక్ ఫాస్ట్ స్కీము అమలుపై విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. రాష్ట్రంలో 24,277 సర్కారు స్కూళ్లు ఉండగా, వాటిలో 18 లక్షల మంది చదువుతున్నారు. ప్రస్తుతం వారందరికీ మిడ్డెమీల్స్ తో పాటు రాగిజావా అందిస్తున్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగిన సమావేశంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీము అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది అమలు కోసం స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ.8, హైస్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.11 చొప్పున ఖర్చు చేయాలని ప్రపోజల్స్ రెడీ చేశారు. ఈ లెక్కన ఏటా సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చయ్యే చాన్స్ ఉంది. అలాగే గ్యాస్ సిలిండర్, గ్యాస్ పొయ్యినీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కిచిడీ, పొంగల్, ఉప్మా, బోండా...
వచ్చే ఏడాది స్కూళ్ల రీఓపెన్ రోజు జూన్ 12 నుంచే ఈ స్కీము ప్రారంభించే అవకాశం ఉంది. అధికారులు మెనూ కూడా రెడీ చేశారు. మూడు రోజులు రైస్ ఐటెమ్స్ పొంగల్, కిచిడీ, జీరారైస్, రెండు రోజులు రవ్వ ఐటెమ్స్ గోధుమరవ్వ, బొంబాయి రవ్వ ఉప్మా ఇవ్వాలని, మరో రోజు బోండా ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు బాధ్యతను ఏజెన్సీలు లేదా ఎన్జీవోలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే కొన్ని చోట్ల ఎన్జీవోలు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాయి. వాళ్లు ముందుకు వస్తే..ఆ ప్రాంతంలో వారికే బాధ్యతలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మిగిలిన చోట ప్రస్తుతమున్న మిడ్డెమీల్స్ ఏజెన్సీలకు అప్పగించనున్నారు. దీనికి గానూ అదనంగా మరో రూ.500 గౌరవ వేతనం ఇవ్వాలని యోచిస్తున్నారు.