ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

కిక్కిరిసిన బుగులోని గుట్ట

రేగొండ, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని గుట్టలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. బుగులోని వెంకటేశ్వరస్వామి జాతరకు బుధవారం భక్తులు తరలివచ్చి, మొక్కులు చెల్లించుకున్నారు. ఏనుగు, మేక ప్రభవాహనాలతో భక్తి శ్రద్ధలతో  స్వామివారిని దర్శించుకున్నారు. గండాలు తొలగిపోవాలని గుట్టపైన ఉన్న గండ దీపంలో నూనె పోసి దీపం వెలిగించారు. మాజీ స్పీకర్ ​సిరికొండ మధుసూదనాచారి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిట్యాల సీఐ పులి వెంకట్​గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

అభివృద్ధి పనుల్లో జాప్యం తగదు

కాశిబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని బల్దియా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య ఆఫీసర్లను హెచ్చరించారు. బుధవారం సాయంత్రం బల్దియా హెడ్ ఆఫీస్​లో పట్టణ ప్రగతిపై వారు రివ్యూ చేశారు. నగర బాటలో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు రూ.16.05కోట్లతో 90 అభివృద్ధి పనులు చేపట్టామని, ఆయా పనుల్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఈ నెల 18,19,20వ తేదీల్లో హైదరాబాద్​లో నిర్వహించే ‘ఫొటో ట్రేడ్ ఎక్స్ పో’ పోస్టర్​ను ఆవిష్కరించారు.

  • ‘అప్పులపాలయ్యాం.. బిల్లులు ఇప్పించండి’
  • జడ్పీ చైర్ పర్సన్​కు విన్నవించుకున్న సర్పంచులు

కమలాపూర్, వెలుగు: గ్రామ పంచాయతీలకు బిల్లులు రాక అప్పులపాలయ్యాయమని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్​బిల్లులు రాక అరువు తెచ్చి, గ్రామాన్ని నడిపిస్తున్నామని జడ్పీ చైర్మన్ ముందు తమ బాధను వెళ్లగక్కారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను వెంటనే వచ్చేలా చూడాలని బుధవారం వరంగల్ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కు.. జిల్లా సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ... గత నాలుగైదు నెలల నుంచి ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బంది పడుతున్నామన్నారు. వెంటనే విడుదల చేయించి,  ఆర్థికభారం నుంచి ఊరట కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా సర్పంచ్​ల ఫోరం కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్​ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అబ్బ ప్రకాశ్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెండ్యాల రవీందర్ రెడ్డి ఉన్నారు.

కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం

హనుమకొండ సిటీ, వెలుగు: సుబేదారిలోని రెడ్ క్రాస్ వెనుకనున్న దివ్యాంగుల సంక్షేమ హాస్టల్​ను బుధవారం చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. హాస్టల్​కు చెందిన జాగను కొందరు కబ్జా చేశారని తెలుసుకుని, అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు చెందిన 30గుంటలను కొందరు కబ్జా చేశారని.. ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టిన వారితో పాటు అనుమతులు ఇచ్చిన అధికారులపైనా యాక్షన్ తీసుకోనున్నట్లు చెప్పారు. ఆ జాగను దివ్యాంగుల సంక్షేమం కోసం వినియోగిస్తామన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, ఆర్డీవో వాసు చంద్ర ఉన్నారు. అంతకుముందు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు చీఫ్ విప్ వినతిపత్రం ఇచ్చారు. మత్య్స సంఘాలకు చేపలు పట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలన్నారు.

కాంప్లెక్స్ వర్క్స్ కంప్లీట్ చేయాలి

బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు సిద్దేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయా పనులను పరిశీలించి కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. గడువులోగా వర్క్స్ కంప్లీట్ చేసి, వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

స్కూల్​లో గొడవలకు తావు లేదు

కమలాపూర్, వెలుగు: స్కూల్​లో గొడవలకు తావు లేదని, బుద్ధి చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని కమలాపూర్ సీఐ సంజీవ్ సూచించారు. బుధవారం మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్​లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లలకు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలని సూచించారు. గొడవలకు దిగి, భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు. సీనియర్లు, జూనియర్లు అన్న భావన ఉండకూడదని, అందరూ బాగా చదువుకోవాలని కోరారు.
ఇద్దరు స్టూడెంట్లకు టీసీలు.. ఎంజేపీ స్కూల్​ లో ఓ స్టూడెంట్ పై దాడి చేసిన సంఘటనపై  డీసీవో సరిత బుధవారం విచారణ చేపట్టారు. దాడి చేసిన ఇద్దరికి టీసీలు ఇచ్చారు. మరో ఆరుగురి విద్యార్థులను మందలించారు. తల్లిందండ్రల నుంచి  క్రమశిక్షణా పత్రాలు రాయించుకున్నారు.

కందగిరి జాతరకు పోటెత్తిన జనం

కురవి, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామ శివారు కందగిరిపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏటా కార్తీక పౌర్ణమికి ఇక్కడ జాతర జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఎంపీ మాలోత్ కవిత, కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి తదితరులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించారు. మంచినీళ్లు, వసతి సదుపాయం లేక ఇబ్బందిపడ్డారు. సాయంత్రం అధియజ్ఞం సంస్థ ఆధ్వర్యంలో లక్ష సీడ్ బాల్స్ ను గుట్ట చుట్టూ వదిలారు.

రామప్ప విశిష్టతను వివరించాలి

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రామప్ప విశిష్టతను భావితరాలకు వివరించాలని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. బుధవారం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్పలో నిర్వహించిన ‘రామప్ప కెపాసిటీ బిల్డింగ్’ ప్రోగ్రాంకు చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. రామప్ప ప్రత్యేకతలు తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం హెరిటేజ్ ట్రస్ట్ మెంబర్ ప్రొ. పాండురంగారావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కేయూ వీసీ టి. రమేశ్, సర్పంచ్ డోలి రజిత, విద్యార్థులు పాల్గొన్నారు.

జనగామ అడిషనల్ కలెక్టర్ గా ప్రపుల్

జనగామ అర్బన్, వెలుగు: జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్)గా ప్రపుల్ దేశాయ్ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. శిక్షణ అనంతరం తొలిసారిగా జనగామ జిల్లాకు నియమితులయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ శివలింగయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జిల్లాకు మెరుగైన సేవలు అందిస్తానని చెప్పారు.