ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • రూ.50వేల నుంచి రూ.2లక్షలకు పెంచిన కేంద్రం

  • ఉమ్మడి జిల్లా కూలీలకు మరింత భరోసా

మహబూబాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి హామీ కూలీలకు  మరింత భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బీమా పరిహారాన్ని పెంచింది. గతంలో ఈజీఎస్ కూలీలకు గరిష్ఠంగా రూ.50వేలు ఇస్తుండగా.. ఈ మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల రాష్ట్ర  ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల నుంచి పని చేస్తున్న కూలీలకు ఇది వర్తించనుంది.

మరింత ప్రయోజనం..

ఉపాధి హామీ పనులు చేసే క్రమంలో అనేకసార్లు కూలీలు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు దివ్యాంగులుగా మారుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బీమా పరిహారాన్ని పెంచింది. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే రూ.2లక్షల బీమా అందనుంది. పనులు చేస్తూ ఎవరైనా గాయపడి శాశ్వత వైకల్యం పొందితే రూ.లక్ష పరిహారం ఇవ్వనున్నారు. పనికి వచ్చిన కూలీలు పక్షవాతానికి గురైనా రూ.లక్ష ఆర్థిక సాయం చేయనున్నారు. పని ప్రదేశంలో తల్లుల వెంట వచ్చే ఆరేండ్ల పిల్లలు గాయ పడినా, దురదృష్టవశాత్తు చనిపోయినా ఇంతే మొత్తం లభించనుంది,

నేటి నుంచి బుగులోని జాతర

భారీగా తరలిరానున్న భక్తులు

రేగొండ, వెలుగు: రెండో తిరుపతిగా పేరుగాంచిన బుగులోని శ్రీవెంకటేశ్వరస్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని గుట్టపై వెలిసిన స్వామివారికి ఇయ్యాల్టి నుంచి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ జాతర జరుగుతుంది. వంశపారపర్యంగా వస్తున్న అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు ఇంటి నుంచి నేడు ఉత్సవ విగ్రహాలను గుట్టపైకి తీసుకెళ్లనున్నారు. రాత్రి స్వామివారికి కల్యాణం జరపనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా 8న దర్శనం నిలిపివేయనున్నారు. 9న స్వామివారికి అభిషేకం, ప్రభబండ్ల ఊరేగింపు, 10,11న మొక్కులు చెల్లించడం. 12న స్వామివారిని గుట్ట నుంచి ఇంటికి చేర్చడంతో జాతర ముగిస్తుంది. గుట్టలపై దర్శానికి వెళ్లే దారిలో చలువ పందిళ్లు వేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో బిల్ల శ్రీనివాస్​ వెల్లడించారు. 

అధ్వానంగా రోడ్లు..

తిరుమలగిరి నుంచి బుగులోని గుట్టకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. బీటీ రోడ్డు మొత్తం కరాబ్ అయి కంకర తేలింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతర నేపథ్యంలో డస్ట్ పోసి గుంతలు పూడ్చే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. మరోవైపు జాతరలో లిక్కర్ సేల్స్ కు ఏకంగా టెండర్ నిర్వహించడం విస్మయం కలిగిస్తోంది.

అదనపు కట్నం కోసం వేధింపులు  

పాయిజన్ తాగిన యువతి కాపాడిన పోలీసులు

నల్లబెల్లి, వెలుగు: అదనపు కట్నం కోసం ఓ భర్త, భార్యను వేధించగా ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండం రుద్రగూడెం జీపీ పరిధిలోని చిన్నతండాకు చెందిన జాటోత్ రజితకు పదేండ్ల కింద పెండ్లి జరిగింది. ఇటీవల అదనపు కట్నం కోసం భర్త రాజు వేధించాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం నల్లబెల్లి ఎంపీడీవో ఆఫీసు పక్కన ఉన్న కాలువ కట్టపై పాయిజన్ తాగింది. దీంతో స్థానికులు డయల్ 100కు కాల్ చేశారు. ఎస్సై రాజారాం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు వాహనంలోనే నర్సంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇన్ టైంలో తీసుకెళ్లడంతో డాక్టర్లు ఆమెను రక్షించారు. రజిత తమ్ముడు రాకేశ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

రాబోయే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దే విజయం

వరంగల్‍, వెలుగు: రాబోయే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ప్రభుత్వ చీఫ్‍ విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‍ఎస్‍ క్యాండిడేట్‍ విజయం సాధించిన నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‍, సీపీఐ, సీపీఎం నేతలతో కలిసి హనుమకొండలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. మునుగోడు తీర్పుతో దేశం కేసీఆర్‍ వైపు చూస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమకు అందాలని ఇతర రాష్ట్రాల జనాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే, ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. సీపీఐ, సీపీఎం నేతలు మేకల రవి, నేదునూరి జ్యోతి, బిక్షపతి, వాసుదేవరెడ్డి, చక్రపాణి, శ్రీనివాస్‍, జేఏసీ నేత వలీఉల్లాఖాద్రీ, కుడా మాజీ చైర్మన్‍ యాదవరెడ్డి  పాల్గొన్నారు.

సైన్స్ పై ఆసక్తి పెంచుకోవాలి

జనగామ అర్బన్, వెలుగు: స్టూడెంట్లు సైన్స్​పై ఆసక్తి పెంచుకోవాలని జనగామ డీఈవో కె. రాము సూచించారు. ఆదివారం చెకుముకి సైన్స్ సంబురాలకు సంబంధించిన పోస్టర్​ను జనగామలోని తన చాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 18న స్కూల్​స్థాయిలో చెకుముకి సైన్స్​ టాలెంట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22న మండల స్థాయిలో, 27న జిల్లా స్థాయిలో ఎగ్జామ్స్ ఉంటాయన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు.

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ మామునూర్ పీటీసీలోసి 10(టి) బెటాలియన్ కు చెందిన 300 మంది ఎన్సీసీ స్టూడెంట్లకు ట్రాఫిక్ రూల్స్ గురించి సీఐ బాబులాల్ అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్డ్ వాడకం, నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ పై సూచనలు చేశారు. సీసీ కెమెరాల పనితీరు, సైబర్ నేరాల గురించి తెలియజేశారు. ఎన్సీసీ స్టూడెంట్లు సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలన్నారు. కల్నాన్ ఖండూరి, ఎన్​సీసీ ఆఫీసర్ బాలరెడ్డి తదితరులున్నారు.