పదేండ్ల తర్వాత.. వరంగల్ కు కొత్త కలెక్టరేట్

 పదేండ్ల తర్వాత.. వరంగల్ కు కొత్త కలెక్టరేట్
  • 2016 లో వరంగల్​ జిల్లాకు కలెక్టరేట్ ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్
  • 2021లో నిర్మాణ ప్రకటన., 2023 జూన్ 17న పనులకు శంకుస్థాపన  
  • ఇన్నాళ్లూ జిల్లా పాలనంతా హనుమకొండ నుంచే..
  • జూన్ లో ప్రారంభించేలా చివరి దశ పనులు స్పీడప్ 

వరంగల్, వెలుగు:  ఓరుగల్లు రాజధాని వరంగల్ జిల్లాకు ఎట్టకేలకు 10 ఏండ్ల తర్వాత సరికొత్త కలెక్టరేట్​ బిల్డింగ్​ (ఐడీఓసీ) రెడీ అయింది. జూన్ లో కొత్త భవనాన్ని ప్రారంభించడానికి అధికారులు పనులను స్పీడప్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సర్కారు 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. వరంగల్ జిల్లాకు మాత్రం 2021లో కొత్త కలెక్టరేట్ నిర్మిస్తామని ప్రకటించి, 18  నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.

కానీ, 2023 జూన్ 17న పనులకు శంకుస్థాపన చేశారు. మూడేండ్లుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వరంగల్ తూర్పు నుంచి మంత్రిగా ఉన్న కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పనులు జోరందుకుని చివరి దశకొచ్చాయి. 

2023 ఎలక్షన్ల టైంలో శిలాఫలకం..

రాష్ట్రంలో 2016 అక్టోబర్11న కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆయా జిల్లాలకు కొత్త కలెక్టరేట్​ భవనాలు నిర్మించారు. కానీ, వరంగల్ జిల్లాను గులాబీ పార్టీ నేతలు వదిలేశారు. ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో 2021లో హనుమకొండ కలెక్టరేట్ (ఐడీఓసీ) ప్రారంభానికి వచ్చిన సందర్భంగా నాటి సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాకు సైతం కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి అంగీకరించారు. ఏడాదిన్నరలో దానిని పూర్తిచేస్తామని చెప్పారు.

కానీ, స్థలసేకరణ కోసమే రెండేండ్ల సమయం తీసుకున్నారు. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్లే మెయిన్​ రోడ్​లోని అజాంజాహి మిల్లు భూముల్లో నిర్మాణానికి 2022లో 6.16 ఎకరాలు, 2023 లో 20.32 ఎకరాలతో కలిపి మొత్తంగా 27.08 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తెలియడంతో హడావుడిగా శిలాఫలకం వేసి వదిలేశారు. కాగా, కొత్త జిల్లాలు ఏర్పడిన పదేండ్లుగా వరంగల్ జిల్లా పాలన అంతా హనుమకొండ జిల్లా కేంద్రం నుంచే నడుస్తోంది. 

కాకతీయ కళాతోరణం.. నయా డిమాండ్

వరంగల్ కలెక్టరేట్ నిర్మాణ పనులకు 2023 జూన్ 17న శంకుస్థాపన చేశారు. హైదరాబాద్​కు చెందిన గౌరీశంకర్ ఇన్​ఫ్రా సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. రూ.80 కోట్లతో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఆర్అండ్​బీ ఇంజినీరింగ్ అధికారులు లక్షా 50 వేల చదరపు అడుగుల్లో జీ ప్లస్ టూ మోడల్లో నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎలక్షన్ల నేపథ్యంలో మొదట్లో పనులు మందగించగా, మంత్రి కొండా సురేఖ చొరవతో కలెక్టర్ సత్యశారద పనులను వేగవంతం చేశారు.

చివరిదశ పనుల్లో ఆఫీస్​లోపల భాగంలో ఫర్నిచర్ వర్క్స్, బయట ఆవరణలో గార్డెనింగ్ పనులు చేపడుతున్నారు. కలెక్టర్​తో పాటు ఇద్దరు అడిషనల్ కలెక్టర్ల నివాసం కోసం నిర్మించే బంగ్లా పనులు పూర్తయ్యాయి. అయితే, ఆఫీస్ మెయిన్ ఎంట్రెన్స్ లో కాకతీయ కళాతోరణ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ వచ్చింది. వరంగల్ కేంద్రంగానే కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ ఉండటం, అసలైన కాకతీయ కళాతోరణాలు ఇక్కడే ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ముందు భాగంలో కాకతీయ కళాతోరణం పెట్టాలని ఇటీవల జిల్లావాసులు అధికారులకు చెప్పారు.

ఇదే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లారు. కావాల్సిన నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర సర్కారు సైతం దీనిని స్వాగతించింది. త్వరలోనే ఈ పనులకుతోడు ఫర్నిచర్, గార్డెనింగ్ పనులు పూర్తిచేసి జూన్ నాటికి నయా వరంగల్ కలెక్టర్ అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు పనిచేస్తున్నారు.

జూన్ నాటికి పూర్తి చేస్తాం..

వరంగల్ జిల్లాకు కొత్త కలెక్టర్ కార్యాలయ భవనం దాదాపుగా సిద్ధమైంది. పనులు చివరి దశకు వచ్చాయి. ఫర్నిచర్, గార్డెనింగ్ పనులు చేపడితే నిర్మాణం పూర్తయినట్లే. ప్రధాన గేటు వద్ద స్వాగత తోరణంగా కాకతీయుల కళాతోరణం నిర్మాణం ఉండాలని అభిప్రాయం వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. జూన్ గడువులోగానే పనులు పూర్తిచేస్తాం.- డాక్టర్ సత్యశారద, వరంగల్ కలెక్టర్