Brian Bennett: 21 ఏళ్లకే జింబాబ్వే ఓపెనర్ సంచలనం.. మూడు రోజుల్లో రెండు వరల్డ్ రికార్డ్స్

Brian Bennett: 21 ఏళ్లకే జింబాబ్వే ఓపెనర్ సంచలనం.. మూడు రోజుల్లో రెండు వరల్డ్ రికార్డ్స్

పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్ కొట్టడం చాలా అరుదు. మూడు రోజుల వ్యవధిలో రెండు వరల్డ్ రికార్డ్స్ అంటే ఔరా అనాల్సిందే.  జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ 2025లో భాగంగా బెన్నెట్ ఈ ఘనతలను అందుకున్నాడు. గురువారం (అక్టోబర్ 2) కెన్యాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కెన్యా పేసర్ లూకాస్ ఒలుయోచ్ బౌలింగ్ లో ఆరు బంతులకు ఆరు ఫోర్లు కొట్టి టీ20 క్రికెట్ లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 

అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ఆరు బంతులకు ఆరు ఫోర్లు కొట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్ లో బెన్నెట్ 25 బంతుల్లో 200 పైగా స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు.. రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కెన్యా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో జింబాబ్వే 2026 టీ20 ప్రపంచ కప్ కు అర్హత సాధించింది.  

అంతకముందు మంగళవారం (సెప్టెంబర్ 30) తాంజానియాపై శతకం బాదిన బ్రియాన్ బెన్నెట్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. 21 ఏళ్ళ వయసులో బెన్నెట్ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో సెంచరీ నమోదు చేయడం విశేషం. 2004లో జన్మించిన బెన్నెట్.. తన బ్యాటింగ్ తో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు.ఈ మ్యాచ్ లో బెన్నెట్ సెంచరీతో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన టాంజానియా క్రికెట్ జట్టు 18.4 ఓవర్లలో కేవలం 108 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.