దళితుల భూములు లాక్కుంటున్నరు

దళితుల భూములు లాక్కుంటున్నరు

మహబూబ్​నగర్/జడ్చర్ల టౌన్, వెలుగు: ‘‘రాష్ట్రంలో ఏ చిన్న పని కావాలన్నా టీఆర్ఎస్​ లీడర్లకు లంచాలియ్యాలె. అలా లంచాలు ఇస్తేనే ఏ పనులైనా అవుతున్నయ్. ఒకవేళ లంచం ఇవ్వకుంటే మాత్రం అలాంటోళ్ల పనులు జరగయి”అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ కుమార్​ అన్నారు. ఆదివారం రాత్రి మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలంలోని కోడ్గల్​ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో సంజయ్​ మాట్లాడారు. 

దళితుల భూములు లాక్కుంటున్నరు

‘‘జడ్చర్ల నియోజకవర్గంలో ఫ్యాక్టరీల కోసం ఇక్కడి రైతుల నుంచి భూములను తీసుకున్నరు. ఇక్కడి నీళ్లను ఆ కంపెనీలకు ఇస్తున్నరు. పేదల జాగాలను కూడా తీసుకున్నరు. ఇక్కడ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ, స్థానికులకు మాత్రం ఉద్యోగాలు ఇస్తలేరు”అని బండి సంజయ్​ ఫైర్​ అయ్యారు. గజ్వేల్​ నుంచి కొందరు ఇక్కడికి వచ్చి దుందుభీ వాగులో ఇసుకను తవ్వుకుని, హైదరాబాద్​లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్​ దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తానని, మూడు ఎకరాల భూమిస్తామని చెప్పి.. ఇప్పుడు పాలమూరు జిల్లాలో దళితుల భూములు లాక్కొంటున్నాడని మండిపడ్డారు. గిరిజన తండాలను పంచాయతీలుగా చేసినా, ఇప్పటి వరకు అక్కడ రోడ్లు, లైట్లు లేవు, గుడి, బడులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జడ్చర్లకు కేసీఆర్ ఎన్ని పైసలిచ్చిండు?

జడ్చర్ల నియోజకవర్గానికి, కోడ్గల్​ గ్రామానికి కేసీఆర్​ ఎన్ని పైసలిచ్చాడో చెప్పాలని ఎమ్మెల్యేను నిలదీయాలని ప్రజలకు సూచించారు. పేదలకు డబుల్​ ఇండ్లు ఇస్తే బీజేపీకి ఓటేస్తారనే భయంతోనే ఇండ్లను పంపిణీ చేయడం లేదన్నారు. కేంద్రం పేదల కోసం రేషన్​ ద్వారా ఇస్తున్న బియ్యాన్ని కూడా కేసీఆర్​ అమ్ముకుంటున్నారని విమర్శించారు. ‘‘ఓ రాష్ట్ర మంత్రి సంజయ్​ చచ్చిపోవాలని కోరుకుంటుండట. నాకు భార్యాపిల్లలున్నరు. ప్రజల సమస్యలు తెసుకోవడానికి పాదయాత్ర చేస్తున్న. కేసీఆర్​ ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించడనికి ఎండను కూడా లెక్క చేయకుండా ఊరూరూ తిరుగుతున్న. ఆయనలా నేను కోరుకోను’’అని చెప్పారు. మళ్లీ ఎన్నికల టైంలో కేసీఆర్​ వస్తాడని, ఎవరికో ఒకరికి పింఛన్​ పత్రం ఇచ్చి మళ్లీ మీతో ఓటు వేయించుకోవడానికి కొత్త డ్రామాలు ఆడతాడని అన్నారు. పేదలు ఆలోచన చేయాలని, బీజేపీకి అవకాశం ఇస్తే పేదలకు న్యాయం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. కాగా, ఆదివారం నాటికి సంజయ్​ పాదయాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గంగాపూర్​ స్టేజ్​ వద్ద పార్టీ లీడర్లు తెచ్చిన 300 కిలోల కేక్ ను సంజయ్​ కట్​ చేశారు.