పద్మారావునగర్, వెలుగు: బాలల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి హెచ్చరించారు. ప్రతి పిల్లవాడికి సురక్షితమైన, బాలల అనుకూల విద్యా వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళవారం బోయిన్‌పల్లి పరిధిలోని సీఎంఆర్ హై స్కూల్, సెయింట్ పీటర్స్, సెయింట్ ఆండ్రూస్ పాఠశాలల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేశారు.
మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, తాగునీరు, తరగతి గదుల స్థితి, ఆర్టీఈ చట్ట అమలు, బాలల పరిరక్షణ నిబంధనలను పరిశీలించారు. పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి బాలల హక్కులు, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థపై సమీక్షించారు. గుర్తించిన లోపాలు వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. కమిషన్ సభ్యులు వందనా గౌడ్, అపర్ణ, వచన్ కుమార్, సరిత, ప్రేమలత అగర్వాల్ ఉన్నారు.
