కవితకు బ్రిడ్జ్ ఇండియా ఆహ్వానం

కవితకు బ్రిడ్జ్ ఇండియా ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు :  రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై కీలక ఉపన్యాసం చేయాలని పబ్లిక్ పాలసీకి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘బ్రిడ్జ్ ఇండియా’ ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం పంపింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు శనివారం ఆమెకు లేఖ రాశారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన సందర్భంగా ఈ నెల 6న లండన్‌‌‌‌లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

భారతదేశ రాజకీయాలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి కవిత కృషి చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. మహిళా బిల్లుకు మద్దతు కూడగట్టడంలో క్రియాశీలకంగా పని చేశారని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేల మంది మహిళా ప్రతినిధులు, 18 పార్టీల నేతలతో ధర్నా చేశారని గుర్తుచేశారు. ఇదే అంశంపై 13 పార్టీల నాయకులు, విద్యార్థి, రైతు సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలనూ సేకరించారన్నారు.