40 టన్నుల స్టీల్ బ్రిడ్జి.. 4 గంటల్లో మాయం.. ఇది కదా అల్టిమేట్ దొంగతనం అంటే..

40 టన్నుల స్టీల్ బ్రిడ్జి.. 4 గంటల్లో మాయం.. ఇది కదా అల్టిమేట్ దొంగతనం అంటే..

ఛత్తీస్‌గఢ్‌ కోర్బా జిల్లాలో వెలుగుచూసిన ఒక వింత దొంగతనం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా దొంగలు డబ్బులు, గోల్డ్ లేదా విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తుంటారు. కానీ ఇక్కడ ఏకంగా 60 అడుగుల పొడవైన ఇనుప వంతెననే రాత్రికి రాత్రే మాయం చేసి అందరినీ విస్తుపోయేలా చేశారు. దాదాపు 40 టన్నుల బరువున్న భారీ ఇనుప నిర్మాణాన్ని దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం దొంగిలించటం చూస్తుంటే.. ఇది ఏ సినిమా సీన్‌కో తక్కువ కాదనిపిస్తోంది. ప్రజలు శనివారం రాత్రి 11 గంటల వరకు ఆ వంతెనపై రాకపోకలు సాగించగా.. తెల్లవారేసరికి అక్కడ వంతెన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో షాకైపోయారు. ఎంట్రా ఇది ఒక్క రాత్రిలో వంతెన ఏమైపోయింది అని అవాక్కయ్యారు. 

40 ఏళ్ల కిందట ప్రజా రవాణా కోసం నిర్మించిన ఈ వంతెనను రైల్వే ట్రాక్ తరహా భారీ ఇనుప గడ్డర్లు, మందపాటి ప్లేట్లతో పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఇంతటి భారీ నిర్మాణాన్ని ఎత్తుకెళ్లడానికి దొంగలు గ్యాస్ కట్టర్లను వాడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాలువకు రెండు వైపులా వంతెనను కత్తిరించిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం వంతెననే కాకుండా.. నగర తాగునీటి సరఫరా వ్యవస్థకు రక్షణగా ఉన్న 40 అడుగుల పొడవైన ఇనుప యాంగిల్స్‌ను కూడా దొంగలు వదల్లేదు. సుమారు 2.5 లక్షల మందికి తాగునీటిని అందించే పైప్‌లైన్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుందని అధికారులు గుర్తించారు. 

ALSO READ | అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

ఈ మొత్తం చోరీ వెనుక పెద్ద ముఠానే ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. దొంగిలించిన ఇనుము విలువ సుమారు 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఒక భారీ వంతెనను విడదీసి, వాహనాల్లో తరలించాలంటే కనీసం కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే ఇంత జరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం.

ఈ ఘటనతో ప్రజల రాకపోకలకు కీలకమైన ఆధారాన్ని దొంగలు ఎత్తుకెళ్లడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక కౌన్సిలర్ లక్ష్మణ్ శ్రీవాస్ అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి స్థానిక స్క్రాప్ డీలర్ల వద్ద సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. వంతెననే మాయం చేసిన ఈ ఊర మాస్ దొంగతనం ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారిపోయింది.