బీఆర్ఎస్​ను గద్దె దించుతం: ఎంపీ లక్ష్మణ్

బీఆర్ఎస్​ను గద్దె దించుతం: ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, డబుల్ బెడ్ రూమ్  ఇండ్ల పరిశీలనకు వెళ్తే అరెస్టు చేస్త రా? అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. గురువారం ఢిల్లీ తెలంగాణ భవన్ లో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కిషన్ రెడ్డి పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. పైగా ఇండ్లను పరిశీలించడం యుద్ధం అంటున్నారు. అలా అయితే నిజంగానే తెలంగాణలో యుద్ధం ఆరంభమైంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతం. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం” అని ఆయన అన్నారు. ప్రభుత్వం భయపడుతున్నదని, బీజేపీ నేతల హౌస్ అరెస్టులే ఇందుకు నిదర్శనమన్నారు. ‘‘పిచ్చుక గూడు లాంటి ఇల్లు కాదు.. విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని తొమ్మిదేండ్లుగా కేసీఆర్ పేదలను ఊరిస్తున్నారు. తొమ్మిదేండ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇండ్లు కట్టించింది” అని అన్నారు. లబ్ధిదారుల జాబితా బయట పెట్టకుండా, ఇండ్లను పరిశీలించకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఫైర్ అయ్యారు.