కొడుకును నీట్​ ఎగ్జాంకు తీసుకొచ్చి.. హోటల్​లో డాక్టర్​ సూసైడ్​

కొడుకును నీట్​ ఎగ్జాంకు తీసుకొచ్చి.. హోటల్​లో డాక్టర్​ సూసైడ్​
  • మెదక్​ రియల్టర్​ హత్యలో పాత్రపై ఆరోపణలతో మనస్తాపం!

కూకట్​పల్లి, వెలుగు: కొడుకును నీట్​ఎగ్జామ్ ​రాయించడానికి మెదక్​ నుంచి నగరానికి వచ్చిన ఓ డాక్టర్ ​కేపీహెచ్​బీ కాలనీలో తాను బస చేసిన ఓ హోటల్​లో సూసైడ్​ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్, అనురాధ దంపతులు డాక్టర్లు. వీరు మెదక్​ పట్టణంలో అనురాధ నర్సింగ్​ హోం నడుపుతున్నారు. చంద్రశేఖర్ ​చిల్ర్డన్​ స్పెషలిస్టు కాగా అనురాధ గైనకాలజిస్ట్. కొడుకు సోహాన్​కు నీట్​ఎగ్జామ్ రాయించడానికి ఆదివారం చంద్రశేఖర్​తన భార్య అనురాధతో కలిసి నిజాంపేట వచ్చాడు. పరీక్ష అయిపోగానే కొడుకుని తీసుకుని ఇంటికి వస్తానని చెప్పి భార్యను మెదక్​కు పంపించాడు. ఆ తర్వాత కేపీహెచ్​బీలోని ఓ హోటల్​లో రూమ్​అద్దెకు తీసుకున్నాడు. రూంకు వెళ్లేటప్పుడే నిద్ర మాత్రలతో పాటు తాడు తీసుకువెళ్లాడు. పరీక్ష అయిపోగానే సోహాన్ ​తండ్రికి ఫోన్​చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో తల్లికి ఫోన్​ చేసి చెప్పాడు. అనురాధ భర్తకి ఫోన్​ చేసింది. అయినా స్పందన లేకపోవడంతో హోటల్ రిసెప్షన్​కి ఫోన్​ చేసింది. హోటల్ ​సిబ్బంది వెళ్లి చూడగా రూం లోపల నుంచి లాక్​వేసి ఉంది. సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని లాక్​ పగులగొట్టి చూడగా చంద్రశేఖర్​ ఫ్యాన్​కు ఉరేసుకుని కనిపించాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మర్డర్​ కేసు భయంతోనేనా?
మెదక్​ జిల్లాలో ఇటీవల జరిగిన ఒక మర్డర్​విషయంలో చంద్రశేఖర్​పై ఆరోపణలు రావడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డాక్టర్​గా ప్రాక్టీస్​ చేస్తూనే కొంతకాలంగా ఆయన ​రియల్ ఎస్టేట్​వ్యాపారం చేస్తున్నాడు. మెదక్​లో రియల్​ఎస్టేట్​వ్యాపారం చేసే కటిక శ్రీనివాస్​తో చంద్రశేఖర్​కు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. పోయిన నెలలో శ్రీనివాస్​ను వెల్దుర్తి మండలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కారులోనే హత్య చేసి పెట్రోల్​ పోసి తగుల బెట్టారు. కటిక శ్రీనివాస్​ హత్యలో చంద్రశేఖర్​ ప్రమేయంపైనా ప్రచారం జరిగింది. పోలీసులు శ్రీనివాస్​హత్య కేసులో ప్రాథమిక సమాచారం ప్రకారం.. అయిదుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు. కేసు దర్యాప్తు పూర్తి కాలేదని, ఇంకా కొనసాగుతోందని ఇటీవల ఎస్పీ తెలిపారు. మర్డర్​ కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉందనే ప్రచారం జరుగుతుండటంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతకు మించి ఆత్మహత్య చేసుకునేంత మిగతా కారణాలేమీ లేవని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.