బ్రిటన్​ ప్రధాని బరిలో 8 మంది

బ్రిటన్​ ప్రధాని బరిలో 8 మంది
  • రిషికి ప్రత్యర్థిగా సువెల్లా
  • 8 వారాల పాటు ఎలక్షన్​ ప్రక్రియ
  • నేడు రెండో రౌండ్​ సీక్రెట్​ బ్యాలెట్

లండన్ ​: బ్రిటన్​ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునక్​ ​ఫస్ట్​ బ్యాలెట్​ రౌండ్​లో 88 ఓట్లతో టాప్​లో నిలిచారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో.. బుధవారం నుంచి ప్రధాని ఎన్నికకు సీక్రెట్​ బ్యాలెట్​ రౌండ్లు మొదలైంది. ప్రధాని పదవికి 8 మంది బరిలో నిలిచారు. వీరిలో భారత మూలాలున్న అటార్నీ జనరల్‌‌ సువెల్లా బ్రేవర్మన్‌‌తో పాటు ఫారెన్​ సెక్రటరీ లిజ్​ ట్రస్స్​, చాన్స్​లర్​ నదీం జహావీ, ట్రేడ్​ మినిస్టర్​ పెన్నీ మోర్డంట్​, మాజీ కేబినెట్​ మినిస్టర్స్​ కెమీ బడేనోచ్​, జెర్మీ హంట్​తో పాటు టామ్​ ట్యూగెన్​దట్​లు ప్రధాన మంత్రి రేసులో ఉన్నారు.

రిషి సునక్​కే మద్దతు
సీక్రెట్​ బ్యాలెట్​ ఫస్ట్​ రౌండ్​లో ఎవరికి అయితే తక్కువ ఓట్లు వస్తాయో.. వారు గురువారం జరిగే రెండో రౌండ్​ నుంచి ఎలిమినేట్​ అవుతారు. కనీసం 30 మంది ఎంపీల మద్దతు ఉన్న వారే.. రెండో రౌండ్​ బ్యాలెట్​ ఓటింగ్​కు ఎలిజిబుల్​ అవుతారు. ఇలా మొత్తం 8 రౌండ్లు పూర్తయిన తరువాత.. ఏ అభ్యర్థికి అయితే ఎక్కువ మంది ఎంపీల మద్దతు లభిస్తుందో వారే బ్రిటన్​ ప్రధానిగా ఎన్నిక అవుతారు. బుధవారం నిర్వహించిన ఓటింగ్​ ప్రక్రియలో కన్జర్వేటివ్​ పార్టీ ఎంపీలు రిషి సునక్​కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బ్రిటన్​ పార్లమెంట్​లో మొత్తం 650 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అధికార కన్జర్వేటివ్​ పార్టీ నుంచి 358 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

జులై 21 నాటికి బరిలో ఇద్దరు అభ్యర్థులే
ప్రధానిగా పగ్గాలు చేపట్టబోయే పార్టీ నాయకుడి ఎన్నిక ప్రక్రియ 8 వారాల పాటు కొనసాగుతుంది. ఒక్కో రౌండ్​లో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వారు తప్పుకుంటూ పోతారు. ఇలా జులై 21 నాటికి ఇద్దరే అభ్యర్థులు పోటీలో ఉంటారు. ఆ తరువాత.. దాదాపు 2 లక్షల మంది టోరీ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు వారు దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడ్తారు. తుది ఇద్దరు అభ్యర్థుల్లో రిషి కచ్చితంగా ఉంటారని స్థానిక నేతలు చెబుతున్నారు. కన్జర్వేటివ్​ పార్టీ కొత్త లీడర్​ను సెప్టెంబర్​ 5న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 7న హౌజ్​ ఆఫ్​ కామన్స్​లో ‘ప్రైం మినిస్టర్స్​ క్వొశ్చన్’ ప్రక్రియ ఉండే చాన్స్​ఉంది. 

ఆర్థిక వ్యవస్థకే తొలి ప్రాధాన్యత : రిషి సునక్​
ఈ సందర్భంగా రిషి సునక్​ ‘ది డెయిలీ టెలిగ్రాఫ్​’తో  మాట్లాడారు. తాను తొలి ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థ వృద్ధికే ఇస్తానని చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని, మాజీ ప్రధాని మార్గరెట్​ మద్దతు ఉందని చెప్పారు. తన విధానాలను సమర్థించారని గుర్తుచేశారు.