- అదుపులోకి తీసుకొని విచారిస్తున్న థేమ్స్ వ్యాలీ పోలీసులు
- ఎప్ స్టీన్ ఫైల్స్ లో కూడా అండ్రూ పేరు
జెఫ్రీ ఎప్ స్టీన్‌తో సంబంధాల నేపథ్యంలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ తమ్ముడు ఆండ్రూ మౌంట్‌బాటెన్ -విండ్సర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్స్టీన్ ఇచ్చే లగ్జరీ పార్టీలకు ఆండ్రూ హాజరయ్యేవారు.
లండన్: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ తమ్ముడు ఆండ్రూ మౌంట్‌బాటెన్ -విండ్సర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆఫీసులో రాసలీలలు సాగించినట్టు (మిస్‌కండక్ట్) ఆరోపణలు రావడంతో గురువారం థేమ్స్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆండ్రూ 66వ పుట్టినరోజున సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేయడం గమనార్హం. పోలీసులు బెర్క్‌షైర్, నార్ఫోక్‌లలోని చిరునామాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
అయితే ఆండ్రూను అరెస్టు చేసినట్టు ప్రకటించకుండా, 60 ఏండ్ల వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే యూకే చట్టాల ప్రకారం సాధారణంగా వివరాలు ఇలాగే వెల్లడిస్తుంటారు.
ఎప్స్టీన్తో సంబంధాలే ప్రధాన కారణం
జెఫ్రీ ఎప్ స్టీన్‌తో సంబంధాలే ఈ అరెస్టుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఎప్ స్టీన్ లైంగిక నేరస్థుడిగా అమెరికాలో శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన ఎప్ స్టీన్ ఫైల్స్‌లో ఆండ్రూ 2010లో బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎన్వాయ్‌గా ఉన్నప్పుడు రహస్య ట్రేడ్ రిపోర్టులు, సింగపూర్, హాంగ్‌కాంగ్, వియత్నాం తదితర దేశాల టూర్ల వివరాలు, ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలకు సంబంధించిన ఫైల్స్ ఎప్ స్టీన్‌కు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎప్ స్టీన్ ఫైల్స్ విడుదల తర్వాత ఈ వ్యవహారంపై పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి థేమ్స్ వ్యాలీ పోలీసులు ఈ కేసులో ఆధారాలను సేకరిస్తున్నారు.
ఆండ్రూపై యువతి ఆరోపణలు
ఆండ్రూకు ఎప్ స్టీన్‌తో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎప్స్టీన్ ఇచ్చే లగ్జరీ పార్టీలకు హాజరయ్యేవారు. ఎప్స్టీన్ సాయంతో యువతులను అక్రమంగా తరలించి, ఆఫీసుల్లోనే రాసలీలలు సాగించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో వర్జీనియా గియుఫ్రే అనే బాధితురాలు తను 17 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ఆండ్రూ లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు చేసింది. దీంతో ఆండ్రూ 2019లో రాయల్ డ్యూటీల నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2022లో సివిల్ సూట్‌లో మిలియన్ల డాలర్ల సెటిల్‌మెంట్ చేశారు. దీంతో గతేడాది కింగ్ చార్లెస్ ఆయన రాయల్ టైటిల్స్ తొలగించి, విండ్‌సర్ నివాసం నుంచి పంపేశారు.
న్యాయ ప్రక్రియకు సహకరిస్తాం: కింగ్ చార్లెస్
ఈ అరెస్టుపై కింగ్ చార్లెస్ స్పందిస్తూ ‘‘ఆండ్రూ మౌంట్‌బాటెన్ విషయంలో తీవ్ర ఆందోళన చెందాను. ఇప్పుడు పూర్తి న్యాయమైన, చట్ట ప్రక్రియ జరగాలి. అధికారులు తగిన విధంగా విచారిస్తారు. దీనికి మా పూర్తి సహకారం ఉంటుంది”అని పేర్కొన్నారు. దీనిపై ఈ సందర్భంగా మరిన్ని కామెంట్లు చేయడం సరికాదని తెలిపారు.
