బ్రిటన్  ప్రధాని రిషి సునాక్‌ కు షాక్.. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రిజైన్

బ్రిటన్  ప్రధాని రిషి సునాక్‌ కు షాక్.. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రిజైన్

లండన్‌ : బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. బ్రిటన్‌ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్‌ రాబ్‌ తన పదవికి రాజీనామా చేశారు. న్యాయశాఖతో పాటు వైట్‌హాల్‌ విభాగాల్లో సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిటీ రిపోర్ట్‌ గురువారం (ఏప్రిల్ 20న) ప్రధాని సునాక్‌కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఏప్రిల్ 21న) డొమినిక్‌ రాబ్‌ తన పదవులకు రాజీనామా ప్రకటించారు.

ఈ సీనియర్‌ కన్జర్వేటివ్‌ ఎంపీ తన పేషీలో పని చేసే సిబ్బందిని వేధించినట్లు, అవమానించినట్లు, ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయాన్ని బ్రిటిష్‌ టాబ్లాయిడ్‌ గార్డియన్‌ ముందుగా బయటపెట్టింది. అయితే.. ఆరోపణలను డొమినిక్‌ రాబ్‌ ఖండిస్తూ వస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా సీనియర్‌ న్యాయవాది అడమ్‌ టోలీని కిందటి ఏడాది నవంబర్‌లో నియమించారు ప్రధాని సునాక్‌. 

డొమినిక్‌ రాబ్‌ వద్ద పని చేస్తున్న  సిబ్బందిని విచారించిన తర్వాత నివేదికను తయారు చేసి, ప్రధాని రిషి సునాక్ కు ఏప్రిల్ 20న అందజేశారు అడమ్ టోలీ. అయితే.. ఈ నివేదికలో ఏం ఉన్నది ఇంకా బయటపడలేదు. ఇంతలోనే డొమినిక్‌ రాబ్‌ తనకు అప్పగించిన అన్ని పదవులకు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు గత ఏడాది అక్టోబర్‌లో రిషి సునాక్‌ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఆరు నెలల్లో ముగ్గురు కేబినెట్‌ మంత్రులు వ్యక్తిగత ప్రవర్తన కారణంగానే పదవుల నుంచి వైదొలగారు.