చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు భేష్.. నిమ్స్ డాక్టర్లను అభినందించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు భేష్.. నిమ్స్ డాక్టర్లను అభినందించిన  బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

హైదరాబాద్, వెలుగు: నిమ్స్ లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించడంపై బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న నిమ్స్ కార్డియో థోరాసిక్ హెచ్ఓడీ డాక్టర్ అమరేశ్వర్ రావు, ప్రముఖ బ్రిటన్ డాక్టర్ దన్నపనేని రమణను ఆయన అభినందించారు. 

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సోమవారం (సెప్టెంబర్ 15) నిమ్స్ లో చిన్నారుల గుండె అపరేషన్ల వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించి, వారికి కొత్త జీవితాలను ప్రసాదిస్తుండడం.. ఇందులో బ్రిటన్ డాక్టర్లు పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.  

బ్రిటన్ డాక్టర్​ దన్నపనేని రమణ మాట్లాడుతూ.. మూడేండ్లుగా  తెలంగాణ ప్రభుత్వం, నిమ్స్ డాక్టర్ అమరేశ్వర్ రావు సహకారంతో గుండె ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేశామన్నారు. గుండె జబ్బులతో చాలా మంది చిన్నారులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారని నిమ్స్ డైరక్టర్ నగరి బీరప్ప అన్నారు.