
హైదరాబాద్, వెలుగు: బ్రూక్‌ఫీల్డ్ తన ఎనర్జీ ట్రాన్సిషన్ వెహికల్, బ్రూక్‌ఫీల్డ్ గ్లోబల్ ట్రాన్సిషన్ ఫండ్–2 కోసం 20 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.77 లక్షల కోట్లు) సమీకరించింది. ఈ నిధి ద్వారా ఇప్పటికే 5 బిలియన్ డాలర్లకు పైగా నిధులను ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెట్టింది. భారతదేశంలో, బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ తో కలిసి ఏర్పాటు చేసిన ఎవ్రెన్ అనే జేవీ ద్వారా 10 గిగావాట్ల విండ్, సోలార్, స్టోరేజీ సామర్థ్యాన్ని వేగవంతం చేయడానికి నిధులను ఉపయోగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడికి ఎవ్రెన్ కట్టుబడి ఉంది. రాష్ట్రంలో మొత్తం 9,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ, పంప్డ్ స్టోరేజీ సిస్టమ్స్, బ్యాటరీ స్టోరేజీ సొల్యూషన్లు, ఈ–-మొబిలిటీ, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కోసం ఈ డబ్బును ఉపయోగిస్తామని బ్రూక్‌ఫీల్డ్ తెలిపింది.
ఇదిలా ఉంటే, బ్రూక్‌ఫీల్డ్ సంస్థ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఓక్‌ట్రీలో మిగిలిన వాటాను దాదాపు మూడు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుంది. ఇది యాజమాన్య వాటాను పూర్తిగా పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. బ్రూక్‌ఫీల్డ్ ఇప్పటికే ఓక్‌ట్రీలో మెజారిటీ వాటాదారు.