టెన్షన్.. టెన్షన్​: గన్ పార్క్ వద్ద  బీఆర్​ఎస్​, బీజేపీ పోటాపోటీ నిరసనలు

టెన్షన్.. టెన్షన్​: గన్ పార్క్ వద్ద  బీఆర్​ఎస్​, బీజేపీ పోటాపోటీ నిరసనలు

గన్​పార్క్​ వద్ద బీఆర్​ఎస్​, బీజేపీ పోటా పోటీ నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూన్ 22న బీజేపీ జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లు గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించడానికి సంకెళ్లు వేసుకుని వెళ్లారు. అదే సమయంలో బీఆర్​ఎస్​ నేతలు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో బీఆర్​ఎస్​నేతలు బీజేపీ కార్పొరేటర్లతో గొడవకు దిగారు.

అమరుల స్థూపం దగ్గరికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారంటూ కార్పొరేటర్లు నినాదాలు చేయగా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని బీఆర్​ఎస్ నాయకులు హెచ్చరించారు. ఇరువర్గాల పరస్పర విమర్శలు, నినాదాలతో గన్​పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 

గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులర్పించే క్రమంలో బీజేపీ పోస్టర్లు ప్రదర్శించింది. ఉద్యమ ద్రోహులకు అందలం.. ఉద్యమకారులకు బంధనం అంటూ.. సీఎం కేసీఆర్ ఫొటోతోపాటు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన నేతల ఫొటోలను ప్రదర్శించింది బీజేపీ. అంతే కాకుండా ఉద్యమకారులకు సంకెళ్లు అంటూ ఫొటోలు ప్రదర్శించింది బీజేపీ. 

బీజేపీ నేతల పోస్టర్లు, సంకెళ్ల ప్రదర్శనతో బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బీజేపీ నేతల వైపు దూసుకొచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రుల ఫొటోలతో ఉద్యమ ద్రోహులకు అందలం అంటారా అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తల వాగ్వాదానికి ధీటుగా స్పందించారు బీజేపీ లీడర్స్, కార్యకర్తలు. ఈ సందర్భంలో రెండు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో.. పోలీసులు జోక్యం చేసుకుని.. రెండు వర్గాలకు సర్దిచెప్పారు.