కృష్ణా, గోదావరి పుట్టిన మహారాష్ట్రలో భూములకు నీళ్లేవి?

కృష్ణా, గోదావరి పుట్టిన మహారాష్ట్రలో భూములకు నీళ్లేవి?

నాతో కలిసి ఉద్యమిస్తే ప్రతి ఎకరానికి నీళ్లు: కేసీఆర్
తెలంగాణ పథకాలు అమలు చేస్తానని ఫడ్నవీస్ హామీ ఇస్తే మహారాష్ట్రకు రాను
అంబేద్కర్ పుట్టినగడ్డపై దళితబంధు ఇయ్యాలె
దేశంలో రైతు తుపాను రాబోతున్నది.. ఎవ్వరూ ఆపలేరు
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడి
నాందేడ్ జిల్లా కాంధార్ లోహలో బీఆర్​ఎస్​ సభ

హైదరాబాద్, వెలుగు : దేశంలో రైతు తుపాను రాబోతున్నదని, దాన్ని ఎవ్వరూ ఆపలేరని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినా దంతో దేశమంతా పర్యటిస్తానని తెలిపారు. ‘‘నే ను హైదరాబాద్​నుంచి నాందేడ్​వచ్చేటప్పుడు, అక్కడి నుంచి లోహకు హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చేటప్పుడు చూస్తే భూములన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో భూములకు నీళ్లు అందకపోవడానికి, తాగడానికి నీళ్లు లేకపోవడానికి కారణం ఎవరు?” అని ప్రశ్నించారు. నీళ్ల కోసం ఏదో దేశాన్ని అడుక్కోవాల్సిన అవసరమే లేదని, సముద్రాల్లో కలుస్తున్న నీటిని పొలాలకు మళ్లిస్తే దేశం పచ్చగా మారుతుందని చెప్పారు. తనతో కలిసి ఉద్యమిస్తే ప్రతి  ఎకరానికి నీళ్లు, దేశమంతా 24 గంటల కరెంట్​ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కాంధార్​లోహలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎవరినో ఎందుకు గెలిపించాలె?

ఢిల్లీ శివారులో చేసిన రైతు ఉద్యమంలో పని చేసిన కురుక్షేత్రకు చెందిన బీఆర్ఎస్ కిసాన్ సెల్ ప్రస్తుత అధ్యక్షుడు గుర్నామ్​సింగ్​చడూనీపై వంద కేసులు పెట్టారని, అయినా రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడారని కేసీఆర్ అన్నారు. తాను ఏ బాధతో ఈ విషయాలు చెప్తున్నాననో అదే బాధ అందరి మనస్సులో పుడితే మన లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ‘‘యూపీ, పంజాబ్​ఎలక్షన్ల కోసం దేశ ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పారు. అంతేతప్ప అప్పుడు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ఎవరికో ఓట్లేసి.. మనం దరఖాస్తులు పట్టుకొని బిచ్చగాళ్లలా వారి వెంట ఎందుకు పడాలో చెప్పాలి. మనలో బలం లేదా? వేరే ఎవరినో ఎందుకు గెలిపించాలె? మనమే ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుదాం” అని పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో విభజిస్తున్నన్నాళ్లూ రైతుల ఆత్మహత్యలు తప్పవని.. రైతులు ఐక్యమైతేనే ఈ దుస్థితికి విరుగుడు దొరుకుతుందన్నారు. ‘‘నేను నాందేడ్​ఎయిర్​పోర్టులో దిగగానే.. ఐదున్నర గంటలకే తిరిగి వెళ్లాలని అధికారులు చెప్పారు. అంటే దేశం ముందుకెళ్తుందా? వెనక్కి వెళ్తుందా? అనేది గమనించాలి. జాతి, మత వాదాన్ని విడిచి పెట్టి రైతువాదాన్ని ఎత్తుకోవాలి” అని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని అన్ని గ్రామాల్లో త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్సీపీ కిసాన్​సెల్​మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న ధోండ్గే, మాజీ ఎంపీ హరిభావ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే వసంత రావు బోండే తదితరులు బీఆర్​ఎస్​లో చేరారు.

నేనొస్తేనే రైతుల ఖాతాల్లో పైసలు పడినయ్

‘‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మహారాష్ట్రలో ఏం పని అని దేవేంద్ర ఫడ్నవీస్ ​అంటున్నారు. నేను దేశ పౌరుడిని. మహారాష్ట్రకే కాదు దేశంలో ఎక్కడికైనా వెళ్తా. రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తే.. రైతులు పండించిన పంటలన్నీ ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. దళితబంధు వంటి పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తే.. నేను ఇక్కడికి రానే రాను. ఈ పథకాలన్నీ అమలు చేస్తానని ఫడ్నవీస్ హామీ ఇస్తే మహారాష్ట్రకు రావడం మానేస్త” అని  కేసీఆర్ చెప్పారు. దేశానికే వజ్రం లాంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుట్టినగడ్డపై దళితబంధు అమలు చేసి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘‘బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ చేయించాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. ప్రతి జిల్లా పరిషత్​పై గులాబీ జెండా ఎగరాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీని గెలిపిస్తే మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు. నాందేడ్​జిల్లా ప్రజలు తనపై ప్రేమ చూపిస్తున్నారు కాబట్టే ఇక్కడికి రెండోసారి వచ్చానని అన్నారు. త్వరలోనే షోలాపూర్​సహా ఇతర ప్రాంతాల్లోనూ పర్యటిస్తానని కేసీఆర్ చెప్పారు. ‘‘నా సభకు స్థానిక ప్రజలు రాకుండా మేకలు కోసి దావత్​లు ఇస్తున్నారు. రైతుల తుపాన్ వచ్చినప్పుడు ఇలాంటి కుట్రలు పని చేయవు. నేను నాందేడ్​లో అడుగు పెడితేనే మహారాష్ట్ర రైతులకు ఖాతాల్లో సర్కారు రూ.6 వేలు వేసింది. ఇన్నాళ్లు ఏం చేశారు?” అని ప్రశ్నించారు. 

చందమామను అడుగుతున్నమా?

‘‘సాగుకు యోగ్యమైన భూమి, నీళ్లు, బొగ్గు సహా ఎన్నో వనరులను దేవుడు ప్రసాదించాడు. ఆ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ఎవరు ప్రతిబంధకంగా మారారనేది ప్రజలు గుర్తించాలి. ప్రభుత్వాలను మనం చందమామనో, నక్షత్రాలనో, బంగారు ముక్కలనో అడగటం లేదు కదా. నీళ్లు, కరెంట్​మాత్రమే అడుగుతున్నాం. 75 ఏళ్లుగా రైతు లు పోరాడుతూనే ఉన్నారు. కానీ పంటలకు కనీస మద్దతు ధరల కోసం ఏటా ఎందుకు ఉద్యమాలు చేయాల్సి వస్తోంది.. ఎందుకు రోడ్లపైకి రావాల్సి వస్తున్నది? ఆలోచించాలి. రైతులు జీవితమంతా పోరాడుతూనే ఉండాలా?”అని కేసీఆర్ ప్రశ్నించారు.