బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటే: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటే: కిషన్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామని కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం చేవెళ్లలోని సీహెచ్​ఆర్ గార్డెన్​లో మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి అధ్యక్షతన చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బూత్ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. కల్వకుంట్ల అవినీతి, దోపిడీ ప్రభుత్వం పోవాలని, అహంకారపు సర్కార్ కుప్పకూలాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని, మజ్లిస్​కి కొమ్ముకాస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నదని ఆరోపించారు. 

బీఆర్ఎస్ ​లాగే.. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీ అని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.10 లక్షల కోట్లు దోచుకుందని, ఇలాంటి పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నదని ఆయన ఫైర్ అయ్యారు. ఓట్ల కోసమే రైతులను రుణమాఫీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ మభ్యపెడుతున్నదని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించేందుకే దళిత బంధు ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. 

చేవెళ్ల వాసుల పొట్ట కొట్టింది కేసీఆరే..: కొండా విశ్వేశ్వర్‌‌ రెడ్డి

ఓటు అడిగే హ‌‌క్కు కేసీఆర్ కు లేద‌‌ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ ప్రాణాహిత ప్రాజెక్ట్ పేరును చేవెళ్ల – ప్రాణ‌‌హిత ప్రాజెక్ట్‌‌గా మార్చి ఇక్కడి వాళ్ల పొట్ట కొట్టారని విమర్శించారు. చంద‌‌న్‌‌వెల్లి, హైతాబాద్ రైతుల‌‌కు ఎకరం రూ.2కోట్లు ఉన్న భూమికి రూ.10 ల‌‌క్షలు ఇచ్చార‌‌న్నారు. సీతారాంపూర్ గుడికి సంబంధించిన భూమిని కూడా అమ్ముకుని చేవెళ్ల వాసుల పొట్ట కొట్టారని మండిప‌‌డ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి విఠ‌‌ల్‌‌, జిల్లా అధ్యక్షుడు న‌‌ర్సింహా రెడ్డి, ద‌‌ళిత మోర్చా అధ్యక్షుడు బాషా, అధికార ప్రతినిధి వీరేంద‌‌ర్‌‌ గౌడ్‌‌, సీనియర్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ద‌‌ళిత ద్రోహి కేసీఆర్: ఎంపీ బండి సంజ‌‌య్‌‌

అంబేద్కర్ జయంతికి, వర్ధంతికి హాజరుకాని దళిత ద్రోహి కేసీఆర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ పుట్టిన ప్రాంతం, చదువుకున్న ఊరు, కన్నుమూసిన స్థలాన్ని బీజేపీ ప్రభుత్వం పంచ తీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. వాటిని రాబోయే తరాలకు స్ఫూర్తి దాయకంగా చేస్తున్నదని వివరించారు. దళిత సమాజం గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని కొనియాడారు. దళితులపై దాడి జరిగితే కేసీఆర్ స్పందించరని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మి కేసీఆర్​కు ప్రజలు ఓట్లు వేశారని, చివరికి వాళ్ల గొంతే కోశారని విమర్శించారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఎంతో మంది ఉద్యమకారులపై కేసులు రిజిస్టర్ అయ్యాయని, కేసీఆర్​పై మాత్రం ఒక్కటి కూడా లేదన్నారు. బీఆర్ఎస్ రిలీజ్ చేసిన ఎమ్మెల్యేల జాబితాలో ఒక్కరు కూడా నిజాయితీపరులు లేరని ఆరోపించారు.