- స్వల్ప ఉద్రిక్తత, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం ఏర్పడింది. మంగళవారం వార్డులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధోకా కార్డు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తుండగా, రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేసుకుంటూ ఒకరి పైకి ఒకరు దూసుకపోయే ప్రయత్నం చేయగా, ఉద్రిక్తత నెలకొంది.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని హరీశ్‌రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయగా, రెండేళ్లు గడిచినా కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదంటూ సీఎంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు సిబ్బందితో ఇరు వర్గాలను అడ్డుకున్నారు.
కొద్దిసేపు తోపులాట జరిగిన అనంతరం పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను సముదాయించి అక్కడి నుంచి పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు లేకున్నా బాకీ కార్డు, ధోకా కార్డుల పంపిణీ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వివాదం ఏర్పడడం చర్చనీయాంశమైంది.
