భూకబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్​అరెస్ట్​

భూకబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్​అరెస్ట్​

వరంగల్​నగరంలో భూ కబ్జాకు యత్నించిన అధికార బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాన్​ బెయిలబుల్​ కేసులు నమోదు చేసి, సెకండ్ అడిషనల్​ జ్యుడిషియల్ ఫస్ట్​ క్లాస్​ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు. హనుమకొండ కాకతీయ కాలనీ ఫేజ్​–2 లో సునీత అనే మహిళ పేరు మీద ఉన్న 200 గజాల స్థలంపై కార్పొరేటర్​ వేముల శ్రీనివాస్​ కన్నుపడింది. డెవలప్మెంట్ పేరుతో ఆ స్థలాన్ని అప్పగించాలని సునీత దంపతులను పలుమార్లు అడిగాడు. అప్పటికే ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఆమె పర్మిషన్​ కూడా తీసుకున్నారు. దీంతో ఆ స్థలాన్ని కార్పొరేటర్​కు ఇచ్చేందుకు నిరాకరించింది. స్థలాన్ని ఎలాగైన చేజిక్కించుకోవాలనే ఆలోచనతో ఈ నెల 13న తన అనుచరులతో అక్కడికి వెళ్లిన వేముల శ్రీనివాస్​ బాధితులు నిర్మించుకున్న కాంపౌండ్​ వాల్​ను కూలగొట్టి దౌర్జన్యం చేశాడు.  

తమను బెదిరింపులకు గురిచేయడంతోపాటు ఆస్తి ధ్వంసం చేయడంతో ఈ నెల 17న బాధితులు హనుమకొండ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. సీపీ ఏవీ రంగనాథ్​ ఆదేశాలతో కార్పొరేటర్​ వేముల శ్రీనివాస్​, అతని డ్రైవర్​ పడాల కుమారస్వామిపై ఐపీసీ 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్​ జేఎఫ్​సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్​ ఆదేశాలతో ఖమ్మం జైలుకు తరలించారు. కాగా భూకబ్జా నేపథ్యంలో అధికార పార్టీ కార్పొరేటర్​ ను జైలుకు తరలించడంతో మిగతా కబ్జాకోరుల్లోనూ గుబులుమొదలైంది.