ఇవాళ (అక్టోబర్15) బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్

ఇవాళ (అక్టోబర్15) బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్
  • తెలంగాణ భవన్​లోరిలీజ్​ చేయనున్న కేసీఆర్​
  •     అభ్యర్థులతోనూ సమావేశం.. బీఫాంలు అందజేత
  •     హుస్నాబాద్​ నుంచి ప్రచార శంఖారావం

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ఆదివారం రిలీజ్​చేయనున్నారు. తెలంగాణ భవన్​లో ఉదయం 11 గంటలకు పార్టీ అభ్యర్థులు, ఎలక్షన్​ఇన్​చార్జ్​లతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల కోడ్​ను ఎలా ఫాలో కావాలి.. తదితర అంశాలపై కేసీఆర్​అభ్యర్థులకు వివరించనున్నారు. బీఫాంలు అందజేసిన అనంతరం బీఆర్ఎస్​‌‌‌‌–2023 ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్​విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే మీడియా సమావేశంలో తొమ్మిదిన్నరేండ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించనున్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడానికి గల కారణాలు, మూడోసారి బీఆర్ఎస్​ను గెలిపిస్తే ప్రజలకు ఏం చేయబోతున్నామో చెప్పనున్నారు. కాంగ్రెస్​ఆరు గ్యారంటీలను మించి బీఆర్ఎస్​మేనిఫెస్టో ఉంటుందని మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ఇప్పటికే పదే పదే చెప్తున్నారు. రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, యువత, ఆసరా పింఛన్​దారులకు మరింత ప్రయోజనం చేసేలా తమ మేనిఫెస్టో ఉండబోతోందని మీడియా చిట్​చాట్​లో కేటీఆర్​చెప్పారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేదలు, నిరుపేదలకు ఎక్కువ మంచి చేస్తామని పేర్కొన్నారు. ఏడాదికి మూడు గ్యాస్​సిలిండర్లు ఉచితంగా ఇస్తారని, రైతులు, మహిళలు, రైతు కూలీలకు ఆర్థిక చేయూతనిచ్చేలా కొత్త స్కీమ్​లు ఉండబోతున్నాయని ప్రగతి భవన్​వర్గాలు చెప్తున్నాయి. రైతుబంధు, ఆసరా పింఛన్​ల పెంపుతో పాటు ఇప్పుడు అమలులో ఉన్న సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా మేనిఫెస్టో ఉండబోతుందని తెలుస్తోంది.

నేటి నుంచి ప్రచారంలోకి కేసీఆర్

అభ్యర్థులకు బీఫాంలు అందజేసి, మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత పార్టీ చీఫ్​కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర ముఖ్య నేతలతో తెలంగాణ భవన్​లోనే లంచ్​చేస్తారు. తర్వాత తెలంగాణ భవన్​ నుంచి హుస్నాబాద్​కి రోడ్డు మార్గంలో బయల్దేరుతారు. సాయం త్రం 5 గంటలకు హుస్నాబాద్​బహిరంగ సభలో పా ల్గొని రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తామో కేసీఆర్ చెప్పనున్నారు. 2014, 2018 ఎన్నికల ప్రచారాన్నీ కేసీఆర్ హుస్నాబాద్​నుంచే ప్రారంభించారు. రెండుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే సెంటిమెంట్​ను కేసీఆర్​కొనసాగిస్తున్నారు. తొలి ఎన్నికల ప్రచార సభను హుస్నాబాద్​లో ఏర్పాటు చేశారు. 

పెండింగ్ ​సీట్ల అభ్యర్థులకూ బీఫాంలు

ఆగస్టు 21న బీఆర్ఎస్​ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. 115 స్థానాల్లో 114 మంది పేర్లు వెల్లడించారు. కేసీఆర్​ గజ్వేల్​తో పాటు కామారెడ్డిలో పోటీ చేయనున్నారు. మల్కాజిగిరి నుంచి సిట్టింగ్​ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ​ప్రకటించినా తన కుమారుడు రోహిత్​కు మెదక్​టికెట్​ ఈఇవ్వకపోవడంతో ఆయన పార్టీని వీడారు. దీంతో మల్కాజిగిరి సీటును మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్​రెడ్డికి ఇస్తామని ఇప్పటికే చెప్పారు. లీడర్ల మధ్య విభేదాలతో పెండింగ్​లో పెట్టిన జనగామ, నర్సాపూర్​టికెట్లపైనా క్లారిటీ ఇచ్చేశారు. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్​రెడ్డి, నర్సాపూర్ లో​సునీత లక్ష్మారెడ్డి పేర్లు ఖరారు చేశారు. ఇవి కాకుండా గోషామహల్, నాంపల్లి సీట్లు మాత్రమే పెండింగ్​లో ఉన్నాయి. ఆ రెండు సీట్ల నుంచి పోటీలో ఉండే అభ్యర్థులకు నేరుగా బీఫాంలు అందజేయనున్నారు. బీఫాంలు ఇచ్చే నాటికి పని తీరు మార్చుకోని ఒకరిద్దరు తప్ప ప్రకటించిన వాళ్లే క్యాండిడేట్లుగా ఉంటారని కేసీఆర్​ఆగస్టు 21న చెప్పారు. మంత్రి కేటీఆర్​ మీడియా చిట్​చాట్​లో కేసీఆర్​కామెంట్స్​ను ఎండార్స్​చేశారు. పనితీరు మెరుగు పరుచుకోని ఇద్దరు ముగ్గురికి బీఫాంలు ఇవ్వకపోవచ్చని చెప్పారు. దీంతో బీఫాంలు దక్కని అభ్యర్థులు ఎవరు అనే చర్చ పార్టీలో సాగుతోంది.