తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. వెంకన్నకు హుండీల ద్వారా కానుల్ని సమర్పిస్తుంటారు.
కొందరు భక్తులు మొక్కు రూపంలో స్వామివారికి చిల్లర నాణేలు శ్రీవారి హుండీలలో వేస్తుంటారు. అయితే ఇకపై నాణేలు బదులు సరికొత్తగా ముడుపు పత్రాల విధానం తీసుకురావాలని టీటీడీ ఆలోచన చేస్తోంది. ఇందు కోసం భక్తులకు కొత్తగా ముడుపు పత్రాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పత్రాన్ని భక్తులు గర్భాలయం వెలుపల ఉన్న శ్రీవారి హుండీలో వేసి తమ మొక్కును చెల్లించుకునే విధంగా కొత్త విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టనుంది.
ఈ మేరకు ఈ నెల 28న జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి.. అందరి ఆమోదం తో తుది నిర్ణయం తీసుకోనుంది.
తిరుమల శ్రీవారి మొక్కులు.. కానుకలు చెల్లించేందుకు టీటీడీ కొత్త విధానం పైన కసరత్తు చేస్తోంది. ఇందు కోసం శ్రీవారి ముడుపు పత్రాలు ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. శ్రీవారిని ఏటా దాదాపు 2.5కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనం అనంతరం భక్తులు హుండీలో కానుకలు సమర్పించడమనే సంప్రదాయం వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది. టీటీడీ బడ్జెట్‌లోనే ప్రధాన ఆదాయ వనరు కూడా హుండీనే.
2025లో హుండీ ఆదాయం రూ.1,383 కోట్లు వచ్చింది. ఇటీవల కాలంలో నగదు రహిత లావాదేవీలకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు . దాదాపు ప్రతి ఒక్కరూ యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా 'శ్రీవారి ముడుపు పత్రం' విధానాన్ని ప్రవేశపెట్టేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుపతితో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ముడుపు పత్రం కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
తిరుమలలో శ్రీవారికి మొక్కులు చెల్లించే భక్తులు.. నాణేలకు బదులుగా ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, నెఫ్ట్ ద్వారా డబ్బుల్ని పంపిస్తే చాలు ఆ డబ్బులకు సరిపడా ముడుపు పత్రాలు ఇస్తారు. వాటిని తీసుకెళ్లి నేరుగా తిరుమల శ్రీవారి హుండీలలో వేయొచ్చు. ఈ విధానాన్ని అమలు చేస్తే భారీగా నాణేలు,డబ్బుల్ని తీసుకెళ్లే పని ఉండదని..భక్తులకు కూడా ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు. భక్తులు రూ.100 నుంచి రూ.లక్ష వరకు చెల్లించి ఈ ముడుపు పత్రాలను కొనుగోలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ ముడుపు పత్రాలను కొనుగోలు చేసిన వెంటనే శ్రీవారి ఖాతాకు డబ్బులు చేరినట్లే. కానీ భక్తులకు హుండీలో మొక్కులు చెల్లించాలనే విశ్వాసం ఉంటుంది.. అందుకే ఆ ముడుపు పత్రాన్ని హుండీలో వేసేలా సరికొత్త విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు.
ముడుపు పత్రాలు మాత్రమే కాదు మరో ఆలోచన దిశగా టీటీడీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రతి రోజూ లక్షలమంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. భక్తులు, దాతలు ఎస్వీ అన్నప్రసాద ట్రస్టుకు విరాళాలు ఇస్తుంటారు. టీటీడీ భక్తులు, దాతలు ఒక్కరోజు మొత్తానికి అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును రూ.44 లక్షలుగా టీటీడీ నిర్ణయించింది.
ఉదయం అల్పాహారానికి రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం రూ.17 లక్షలు, రాత్రి భోజనానికి రూ.17 లక్షలు కలిపి రూ.44 లక్షలు అవుతుంది. కొంతమంది ఈ మూడు అమౌంట్‌లలో ఒకటి ఇస్తుంటారు. కొందరు భక్తులు ఇంత భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వలేరు. అలాంటి వారి కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పదిమంది, వందమంది భక్తులకు సరిపడా విరాళం ఇవ్వొచ్చు.. అప్పుడు వారి పేరుతో అన్నదానం చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది..
