హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ నమ్ముకున్న ఫేక్ ప్రచారం బూమరాంగ్అయింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. ఆ పార్టీ సర్క్యులేట్చేసిన ఫేక్‌వీడియోలు, నకిలీ క్లిప్పింగ్‌లను జనం తిప్పికొట్టారు. గూబ గుయ్యుమనిపించారు. తమ అభ్యర్థే గెలుస్తారని, తమకు పోటీ లేదనే విధంగా గులాబీ టీమ్ చూపించిన చిత్ర విచిత్రాలు ఆ పార్టీకే ఎదురుతిరిగాయి. కేవలం భావోద్వేగాలను, అబద్ధపు ప్రచారాన్ని నమ్ముకున్నందునే బీఆర్ఎస్ ఓడిపోయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఫేక్ ప్రచారంతో ప్రజల ఆలోచనలు మార్చాలని చూసినా.. జనం మాత్రం కాంగ్రెస్‌కే ఓటేశారని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వీ6 టీవీ, వెలుగు దినపత్రిక లోగోలతో నకిలీ వీడియో క్లిప్పింగ్‌లు, తప్పుడు వార్తలను బీఆర్ఎస్సోషల్ మీడియా టీమ్సృష్టించి.. వైరల్ చేసింది. తమ అభ్యర్థికి అనుకూలంగా, ప్రత్యర్థికి వ్యతిరేకంగా అవాస్తవాలను సోషల్ మీడియాలో తిప్పింది. దీనిపై వీ6 వెలుగు యాజమాన్యం తక్షణమే స్పందించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ లోగోతో వస్తున్న ఫేక్ వీడియోలను, తప్పుడు వార్తలను నమ్మొద్దని ఓటర్లను అప్రమత్తం చేసింది.
పెయిడ్ సర్వేలు.. తుస్సు తుస్సు
బై పోల్‌కు ముందు వచ్చిన కొన్ని ‘పెయిడ్ సర్వేలు’ తుది ఫలితంలో తుస్సుమన్నాయి. ఈ సర్వేల ద్వారా తమ అభ్యర్థికే విజయం దక్కుతుందని, గట్టి పోటీ ఇస్తున్నామని బీఆర్‌ఎస్ వర్గాలు పదేపదే ప్రచారం చేసుకున్నాయి. అయితే.. ఈ ‘పెయిడ్సర్వేలు’ క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు దూరంగా, కేవలం కొందరిలో మానసిక ఉత్సాహాన్ని కలిగించే ఉద్దేశంతోనే రూపొందించినట్లు ఓట్ల లెక్కింపులో బట్టబయలైంది. డబ్బులిచ్చి తమకు అనుకూలంగా ఫలితాలను రాబట్టుకోవడానికి చేసిన ఇలాంటి ప్రయత్నాలు ఓటర్లను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.
