దానంపై అనర్హత పిటిషన్ ఇచ్చిన బీఆర్‌‌‌‌ఎస్

దానంపై అనర్హత పిటిషన్ ఇచ్చిన బీఆర్‌‌‌‌ఎస్
  •  త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​కు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌‌లో చేరిన దానం నాగేందర్‌‌‌‌పై అనర్హత వేటు వేయా లని స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌‌‌కు బీఆర్‌‌‌‌ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు  ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌‌ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌లో స్పీకర్‌‌‌‌ను కలిసి పిటిషన్ అందజేశారు. అనంతరం కౌశిక్‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు.

  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో దానంపై అనర్హత వేటు పడడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టాలని చెప్పాడని, ఇప్పుడు ఆయనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడని కౌశిక్‌‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌‌రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం మానుకోవాలన్నారు. ఇప్పుడు తమను కొడుతున్నారని, ఆ తర్వాత తాము కొడితే ఇక రేవంత్ లేచే పరిస్థితి ఉండదన్నారు.